![33 చోట్ల హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక 33 చోట్ల హింసాత్మక ఘటనలపై సిట్ నివేదిక](https://nijamtoday.com/wp-content/uploads/2024/05/SIT.webp)
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అలర్లపై ఎన్నికల కమిషన్ ఆదేశంపై 13 మంది సభ్యులతో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు.
150 పేజీలతో సుదీర్ఘ నివేదికను డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ నివేదికను ఎన్నికల కమిషన్ కు పంపనున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సిట్ రెండు రోజులపాటు దర్యాప్తు కొనసాగించింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఎఆర్‌ను సిట్ అధికారులు పరిశీలించారు. మొత్తం ఐదు అంశాలపై సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం, ఎఫ్ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. స్థానిక అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్ బృందం, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది.
సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.మరోవైపు హింసాత్మక ఘటనలకు సంబంధించి మరిన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదుచేయాలని సిట్ సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు రాజకీయ నేతల అరెస్టులపైనా సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ నాలుగు బృందాలుగా విడిపోయి, ఒకొక్క ప్రాంతంకు వెళ్లి రెండ్రోజుల పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాలలో స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
పవన్ కళ్యాణ్ కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్