పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్‌ ‌పదవికి అరవ శ్రీధర్‌ రాజీనామా

పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో విప్‌ ‌పదవికి అరవ శ్రీధర్‌ రాజీనామా
ఏపీలో జనసేనకు చెందిన ఎమ్మెల్యే పనితీరుపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  అసహనం వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో వారిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. దానితో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ‌ప్రభుత్వ విప్‌ ‌పదవికి రాజీనామా చేశారు.  శ్రీధర్‌‌తో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ‌ఆ పార్టీ పిఎసి సభ్యులు నాదెండ్ల మనోహర్‌‌తో కలిసి శనివారం విడివిడిగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం తన విప్‌ ‌పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్‌ ‌లేఖ విడుదల చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్‌ మోసం చేశారని హర్షవీణ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.  ఈ అంశంపై విచారణ చేసేందుకు జనసేన ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ విచారించి ఇటీవల నివేదికను పార్టీకి అందజేసింది.
పవన్‌కల్యాణ్‌, శ్రీధర్‌ ‌సమావేశంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సమావేశం అనంతరం తన వ్యక్తిగత కారణాలతో విప్‌ ‌పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్‌ ‌లేఖ విడుదల చేశారు.  పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో కూడా పవన్‌ ‌తో భేటీ అయ్యారు. బాలరాజుపై కూడా ఆర్థిక ఆరోపణలు, కుటుంబానికి సంబంధించిన ఫిర్యాదులొచ్చాయి.  ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వాఖ్యలు చేయడంపై సంజాయిషీ అడిగారు.
వ్యక్తిగత వ్యవహారాలను చక్కదిద్దుకొనేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని పవన్‌‌ను బాలరాజు కోరారు.  అదేవిధంగా నియోజకవర్గంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన రూ.147 కోట్ల పనుల అంశంపై చర్చకు వచ్చింది. సకాలంలో ఈ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ‌బాలరాజును పవన్‌ ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తానని సమావేశం అనంతరం బాలరాజు లేఖ విడుదల చేశారు.