
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశారని విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ రౌడీలు విచక్షణారహితంగా దాడి చేస్తే వారిపై కేసులు నమోదు చేయకుండా వారికి అండగా నిలిచిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేటడాన్ని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రంగా ఖండించారు.
మహిళల పైన, బాలింతరాలి పైన వైసీపీ మద్దతు దారులు దాడి చేస్తే, దారుణానికి ఒడిగట్టిన వారి మీద చర్యలు తీసుకోకుండా బాదితులకు అండగా నిలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు, ఈ దారుణాన్ని ప్రజల ముందు ఉంచిన మీడియా వారికి 41ఏ నోటీసులు ఇవ్వడం అంటే అది ఆటవిక న్యాయం అవుతుందని ఆయన మండిపడ్డారు. పోలీసు శాఖలో ఇంకా కొంత మంది జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఉదంతం అనంతరం విశాఖలో కూడా అలాంటి వ్యవహారమే నడుస్తుందా? అనే అనుమానం వస్తుందని దినకర్ తెలిపారు. పోలింగ్ సమయంలో, అనంతరం ఓటమి తప్పదన్న నైరాశ్యంలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో జరిగిన దాడులకు సహకరించిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ పట్టణంలో తమకు ఓటు వేయలేదనే చేసిన దాడులను దారి మళ్లించి కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర పాత్రధారులని శిక్షించాలని ఆయన కోరారు. అంతే కాకుండా తిరుపతిలో పులివర్తి నానిపైన జరిగిన హత్యాయత్నాన్ని భాదితులపై నెట్టే ప్రయత్నం చేస్తున్న వారిని సిట్ గుర్తించి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.
కాగా, న్యాయం చేయాలని బాధితుల వైపు నిలబడితే కేసులు పెట్టి నోటీసులివ్వడమేంటని విశాఖ నార్త్ కూటమి, బీజేపీ మాజీ ఎమ్యెల్యే అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు పోలీసులపై మండిపడ్డారు. కంచరపాలెం బర్మా క్యాంప్ వాసులు సుంకర ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి ఘటనను ఖండిస్తూ ఆయన ఈ నెల 17న మీడియా సమావేశం నిర్వహించారు.
More Stories
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనే లేదు
మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ అరెస్ట్