అల్లర్ల నిందితుల అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు

అల్లర్ల నిందితుల అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు
ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాయుత ఘటనలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాధమిక నివేదికను అనుసరించి దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించినట్లు చెప్పారు.
 
150 పేజీలతో సుదీర్ఘ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ సమర్పించారు.ఈ నివేదిక ఆధారంగా పలువురు పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేయనున్నారు.  ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్‌ ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది.
 
రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారని,ఈ అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని డిజిపి చెప్పారు. మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించటానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని చెప్పారు. అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్టులు చేయటంతో పాటు చార్జీ షీట్లు దాఖలు చేయాలని డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా ఆదేశించారు.
తాము ఇచ్చిన నివేదికను డీజీపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించినట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు.  పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. ఈకేసుల్లో 1370 మంది నిందితులుగా తేల్చిన పోలీసులు కేవలం 124 మందినే అరెస్ట్ చేశారని సిట్ నివేదికలో వెల్లడించింది.

అయితే కేవలం 124 మంది నిందితులనే ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తెలిపింది. 94 మందికి 41 ఏ నోటీసులు అందించారని తెలిపింది. మిగిలిన నిందితులను కూడా త్వరిగతిన అరెస్ట్ చేయాలని పోలీసులకు సిట్ అధికారులు సూచించారు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో 10, మాచర్లలో 8, గురజాలలో 4 కేసులు చొప్పున మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. 

మొత్తం 581 మంది నిందితులు పాల్గొంటే 274 మందిని గుర్తించారు. వీరిలో కేవలం 19 మందిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తేల్చింది. 91 మంది నిందితులకు 41 ఏ నోటీసులిచ్చారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 చొప్పున మొత్తం నాలుగు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 61 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 47 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఏడు ఘటనల్లో 728 మంది నిందితులు పాల్గొంటే 396 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. కేవలం 91 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 634 మంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. సిట్ నివేదికను పరిశీలిస్తే పోలీసులు కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్ విషయాల్లో ఎంత నిర్లక్ష్యం వహించారో తెలుస్తుంది.

కాగా, పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడించాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు.