ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్

ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 60.09 పోలింగ్‌ శాతం నమోదైందని ఈసీ వెల్లడించింది.
 
2019లో ఏడు రాష్ర్టాల్లోని 51 స్థానాలకు జరిగిన ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో 64.16% పోలింగ్‌ నమోదైంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో ఇప్పటి వరకు మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 25 రాష్ర్టాలు/యూటీల్లో 428 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 25న ఆరో దశ, జూన్‌ 1న చివరి దశ జరుగునున్నాయి.
 
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా నియోజకవర్గంలో 56.73 శాతం పోలింగ్ జరిగింది. ఇది 1984 తర్వాత అత్యధికం కావడం విశేషం. 2019లో 34.6 శాతం మాత్రమే నమోదయింది. అయితే 2022లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. ఇక్కడి నుండి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు.
 
కాగా, మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం 2019తో పోల్చుకుంటే తక్కువగా పోలింగ్ జరిగింది.  పోలింగ్ జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాల్లో రాత్రి 11.30 గంటలకు 57.79 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్‌కు చెందిన కెఎల్‌ శర్మపై బిజెపి ఎంపి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీలో 54.15 శాతం పోలింగ్‌ నమోదైంది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో 57.85 శాతం పోలింగ్‌ నమోదైంది.
 
సోమవారం మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యల్పంగా 54.29 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నేళ్లుగా తక్కువ పోలింగ్‌ నమోదవుతున్న ముంబైలోని ఆరు స్థానాల్లో 47 శాతం నుంచి 56 శాతం వరకు పోలింగ్‌ నమోదైంది. ముంబైలోని ఆరు స్థానాల్లో, తక్కువ ఓటింగ్ శాతం చాలా సంవత్సరాలుగా ఆందోళనకరంగా ఉంది.
 
ఎన్నికల కమిషన్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలలో మొదటి నాలుగు దశల్లో మొత్తం 66.95 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి మూడు దశలు తగ్గుముఖం పట్టగా, నాల్గవ దశలో 96 నియోజకవర్గాల్లో 69.16 పోలింగ్ నమోదైంది. 2019లో ఈ స్థానాల్లో 68.8 శాతం పోలింగ్ నమోదైంది.
 
ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన తొలి దశలో 66.14 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో దాదాపు 69.29 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్‌ నమోదైంది. 2019లో 69.43 శాతంగా ఉన్న 66.71 శాతం తగ్గింది. మే 7న జరిగిన మూడో దశలో 93 నియోజకవర్గాల్లో, 2019లో 66.58 శాతంతో పోలిస్తే 65.68 శాతం తుది పోలింగ్ నమోదైంది.
 
ఇలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల తొలి నాలుగు దశల్లో 2019తో పోలిస్తే దాదాపు 2.5 కోట్ల ఓట్లు అధికంగా పోలయ్యాయని ఎస్‌బీఐ తాజా పరిశోధనా నివేదిక పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డాటాను ఉటంకించింది. నాలుగు దశల ఎన్నికల్లో 45.1 కోట్ల మంది ఓటేశారని, మొత్తంగా 66.95 పోలింగ్‌ శాతం నమోదైందని తెలిపింది. 
 
అయితే శాతం పరంగా చూస్తే 2019 ఎన్నికల సమయంలో నాలుగు విడతల్లో 68.15 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించింది. పోలింగ్‌ జరిగిన 90 శాతం నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు పెరుగడమో లేదా గత ఎన్నికలతో పోలిస్తే అటుఇటూగా ఉండటమో జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా దాదాపు 67.5 శాతం పోలింగ్‌ నమోదవుతుందని అంచనా వేసింది.
 
కాగా, పశ్చిమబెంగాల్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. బకర్‌పోర్‌, బొంగావ్‌, ఆరంబాఘ్‌, హుగ్లీలలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పశ్చిబెంగాల్‌తోపాటు ఒడిశాలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రోడ్డు, రైలు కనెక్టివిటీ కల్పించనందుకు నిరసనగా యూపీలోని కౌశాంబి జిల్లా హిసంపూర్‌ మధో గ్రామ ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. వివిధ పార్టీల నుంచి 1,913 ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది.