* క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్న బెంగాల్ పోలీసులు
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి, జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడంలో భాగంగా సరిహద్దు భద్రతా దళానికి (బిఎస్ఎఫ్) అదనపు భూమిని బదిలీ చేసినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. దీంతో బీఎస్‌ఎఫ్‌కు అప్పగించిన మొత్తం భూమి పరిమాణం 142.79 ఎకరాలకు చేరుకుంది.
ఈ భూమిని సరిహద్దు అవుట్‌పోస్టు నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు కోసం ఉపయోగించనున్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తన సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని 9 కీలక సరిహద్దు జిల్లాల్లో ఈ భూమిని పంపిణీ చేశారు. సిలిగురి సబ్ డివిజన్‌లోని ఫాన్సీదేవా ప్రాంతంలో ఇప్పటికే 27 కిలోమీటర్ల మేర భూమిని బీఎస్‌ఎఫ్‌కు అప్పగించడంతో, అక్కడ సరిహద్దు కంచె నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి.
మరోవంక, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు క్రిమినల్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా నడిరోడ్లపై తిప్పుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం మారిన నాటి నుంచి పోలీసులు క్రిమినల్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత వారిని అర్ధనగ్నంగా లోదుస్తులపై రోడ్ల మీద తిప్పుతున్నారు. అది కూడా వారు ఏ జనాలను అయితే భయపెట్టారో ఆ ప్రదేశాల్లో అర్ధనగ్నంగా తిప్పుతున్నారు. గతంలో ఆ క్రిమినల్స్‌కు ఎదురు తిరగాలన్నా, వారి గురించి గట్టిగా మాట్లాడాలన్నా జనం భయపడేవారు. పోలీసులు చేస్తున్న ఈ పనితో జనంలో ధైర్యం వచ్చింది. క్రిమినల్స్ గురించి పబ్లిక్‌లో గట్టిగానే మాట్లాడుతున్నారు.
ఉత్తర, దక్షిణ, మధ్య హౌరాలో పోలీసులు క్రిమినల్స్‌ను రోడ్లపై తిప్పుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర హౌరాలో ఆకాశ్ సింగ్ అనే లోకల్ డాన్ జనాలను తీవ్రంగా భయపెట్టేవాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన తర్వాత గుండు కొట్టించారు. బనియర్, డ్రాయర్‌పై వీధుల్లో తిప్పారు. అతడు ఏ వీధుల్లో అయితే నేరాలకు పాల్పడ్డాడో ఆ వీధుల్లో అతడిని తిప్పారు.
క్రిమినల్స్‌ను అర్ధనగ్నంగా రోడ్లపై తిప్పటం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘క్రిమినల్స్‌కు గట్టి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లో భయం పోగొట్టడం కూడా ఇందులో భాగమే. ప్రజలు ఎలాంటి భయం లేకుండా జీవించాలన్న లక్ష్యంతోటే ఈ పని చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

More Stories
ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్
50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు టిఎంసిని వీడనున్నారా?
ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం