నిర్భయంగా వ్యవహరించండి.. మీ చర్యలకు నాదే బాధ్యత

నిర్భయంగా వ్యవహరించండి.. మీ చర్యలకు నాదే బాధ్యత
* జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడకం వివాదం నేపథ్యంలో సిఆర్పిఎఫ్ చీఫ్ దళాలకు భరోసా 
 
జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పెల్లెట్ గన్ల వాడకంపై చెలరేగిన వివాదం నేపథ్యంలో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) చీఫ్ తన దళాలను నిర్భయంగా వ్యవహరించాలని కోరారు. వారి చర్యలకు తాను బాధ్యత వహిస్తానని భరోసా ఇచ్చారు. దళం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగిస్తూ,  డైరెక్టర్-జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఇలా పేర్కొన్నారు:
 
“సిఆర్పిఎఫ్ డైరెక్టర్-జనరల్‌గా, మీలో ప్రతి ఒక్కరికీ నేను హామీ ఇస్తున్నాను. అది ఆపరేషనల్ బెటాలియన్ అయినా లేదా శాంతిభద్రతల విభాగం అయినా, మీ విధులను నిజాయితీగా నిర్వర్తించడంలో మీరు తీసుకునే ఏ నిర్ణయాలకైనా, మీరు చేపట్టే ఏ చర్యలకైనా, ఆ నిర్ణయాలు, చర్యలన్నింటికీ నేను బాధ్యత వహిస్తాను. మీ విధులను నిర్భయంగా నిర్వర్తించడం కొనసాగించండి.”
 
“డైరెక్టర్ జనరల్‌గా, ఎక్కడైతే బాధ్యత లేదా జవాబుదారీతనం తీసుకోవాల్సి వస్తుందో, నేను దానిని తీసుకుంటాను,” అని సింగ్ స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లకు నిరసనగా జూలై 20న సిజెపి పార్లమెంటుకు నిర్వహించిన మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్, మధ్య ఢిల్లీలోని ఇతర ప్రాంతాలలో పరిస్థితిని నిర్వహించిన తీరుపై సీఆర్పీఎఫ్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) విమర్శలను ఎదుర్కొంటోంది.  అల్లర్లు, ఇతర ప్రజా అలజడులను ఎదుర్కోవడానికి 1992లో సీఆర్పీఎఫ్‌లో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 
 
బుధవారం అంతకుముందు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తాను పెల్లెట్ గాయాలను చూశానని ఆరోపించారు. నిరసనల సమయంలో పోలీసులు, ఆర్ఏఎఫ్ విద్యుత్ ప్రవహించే లాఠీలు, మేకులు దింపిన లాఠీలను ఉపయోగించారని ఆయన వాదించారు. 
 
మరోవంక, ఈ నెల ప్రారంభంలో, జూలై 20న పార్లమెంటు మార్చ్ సందర్భంగా జనసమూహ నియంత్రణ కోసం అవలంబించిన “ఫోర్స్ గ్రేడియంట్” నిర్దేశిత ప్రమాణాలు, ఆర్ఏఎఫ్ శిక్షణకు అనుగుణంగా లేదని ఆర్ఏఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీమా ధుంధియా సిబ్బందందరికీ చెప్పినట్లు తెలిసింది. నిరసనకారులు పార్లమెంటు వైపు కవాతు చేస్తున్నప్పుడు, ముగ్గురు వ్యక్తులు పెల్లెట్ గన్ గాయాలకు గురైన ఘటనలో, అంతర్గత సమీక్షలో తీవ్రమైన కార్యాచరణ లోపాలు బయటపడిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. 
 
పోలీసింగ్‌లో, ఫోర్స్ గ్రేడియంట్ అంటే వారు ఎదుర్కొనే ముప్పు లేదా ప్రతిఘటనను బట్టి పోలీసులు ఉపయోగించే వివిధ స్థాయిల బలప్రయోగం. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, జూలై 20న జంతర్ మంతర్, పార్లమెంటు పరిసరాల్లో సిబ్బందిని మోహరించడానికి ముందు వారికి సరైన, సకాలంలో బ్రీఫింగ్ ఇవ్వలేదని ధుంధియా అధికారులతో చెప్పారు. 
 
జమ్మూ, కాశ్మీర్ వంటి ప్రత్యేక ఆపరేషన్స్ జోన్‌ల నుండి ఇటీవల బదిలీ అయిన సిబ్బందిని ఢిల్లీలో జన సమూహ నియంత్రణ విధులకు వెంటనే నియమించకూడదని ఆర్‌ఏఎఫ్ చీఫ్ చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
 
 “జమ్మూ & కాశ్మీర్ వంటి ప్రత్యేక ఆపరేషన్స్ జోన్ లేదా ఇతర కార్యాచరణ ప్రాంతాల నుండి బదిలీ అయిన సిబ్బందికి భిన్నమైన పని వాతావరణం, కార్యాచరణ దృక్పథం ఉంటుందని, అయితే ఢిల్లీ, బీహార్, అస్సాం, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు జన సమూహ నియంత్రణ మరియు ప్రజా భద్రత నిర్వహణకు విభిన్నమైన, సమతుల్యమైన విధానం అవసరమని ఆమె నొక్కి చెప్పారు,” అని తెలిపారు. 
 
అంతకుముందు, నీట్ వ్యతిరేక నిరసనకారులపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది తీసుకున్న చర్యపై “వృత్తిపరమైన సంఘటనానంతర అంచనా” నిర్వహించబడుతుందని సింగ్ చెప్పారు.