
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. మైనారిటీలపై ప్రధాని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోదీ తాజాగా ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ వీడియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.
“రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ నిరంతరం ఉల్లంఘిస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను బట్టబయలు చేయడమే నా ఎన్నికల ప్రసంగాల లక్ష్యం. మైనారిటీలకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అని చెప్పుకొచ్చారు.
“నేను కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని విపక్షాలు ఉల్లంఘిస్తున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనను ప్రజలకు తెలియజేయడం నా బాధ్యత” అని పేర్కొన్నారు.
“బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. నేను సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని నమ్ముతాను. మేము ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించడానికి సిద్ధంగా లేము. అందరినీ సమానంగా పరిగణిస్తాం” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
హిందువుల సంపదను కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదా అది ప్రచార ప్రచార అస్త్రమా? అన్న ప్రశ్నకు మోదీ దీటుగా బదులిచ్చారు. తాను చేయని వ్యాఖ్యలపై అసత్య ప్రచారాన్ని విపక్షాలు చేశాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో వెలువడిన రోజే అందులో ముస్లిం లీగ్ ముద్ర ఉందని తాను చెప్పానని గుర్తు చేశారు.
ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తన వ్యాఖ్యలపై స్పందించాల్సిందని, కానీ మౌనంగా ఉండిపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటుతుందని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదని విపక్షాలు అపోహలు సృష్టించారని విమర్శించారు.
‘2019 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా ఉంటుంది. బీజేపీ మిత్రపక్షాలు గతంలో కంటే ఈ సారి దక్షిణాదిలో మరిన్ని సీట్లు గెలుచుకుంటాయి. దక్షిణాదిలో ఎన్డీఏ సీట్లు, ఓట్లు పెరుగుతాయి.’ అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన