ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబ్రహాం అకార్డ్ తెరపైకి తీసుకురావడంతో మధ్యవర్తిగా కీలక అంతర్జాతీయ పాత్ర పోషిస్తున్నట్లు సంబరపడుతున్న పాకిస్థాన్ ను ఇరకాటంలోకి నెట్టివేసిన్నట్లు అయింది. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్ వంటి ముస్లిం దేశాలు సంతకం చేయాలన్న ఆయన పిలుపు డిమాండ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్, పలు గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడమే లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాలనే అబ్రహాం అకార్డ్స్. ఇస్లాం, యూదు, క్రైస్తవల్లోని అబ్రహామిక్ మూలాల ఆధారంగా ఈ పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో ఈ ఒప్పందాలపై యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో దేశాలు సంతకాలు చేశాయి. గతేడాది నవంబరులో కజికిస్థాన్ ఇందులో చేరింది.
ఇందులోని సౌదీని చేర్పించడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, గాజాలో హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఫలించలేదు. అబ్రహాం అకార్డ్స్‌లో చేరే దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తిస్తాయి. ఆ దేశంతో వాణిజ్య, పర్యాటక, భద్రతా రంగాల్లో పరస్పరం సహకారం అందించుకుంటాయి. పశ్చిమాసియా శాంతిలో అబ్రహాం అకార్డ్స్ కీలకం. వీటి వల్ల ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది.
అంతేకాదు, ఇజ్రాయెల్‌తో మొరాకో, బహ్రెయిన్ మధ్య నేరుగా విమాన సర్వీసులకు అవకాశం కల్పించింది. ఈ ఒప్పందంతోనే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌తో ఇజ్రాయెల్ ఆర్థిక, భద్రతా సంబంధాలను బలోపేతం చేసుకుంది. కానీ, ప్రత్యేక పాలస్తీనా విషయంలో పరిష్కారం చూపకపోవడంతో పలు ముస్లిం మెజార్టీ దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.
ఇరాన్, మధ్యప్రాచ్యంతో ముడిపడి ఉన్న ఒక పెద్ద శాంతి ప్రయత్నంలో భాగంగా అబ్రహం ఒప్పందాలలో చేరాలన్న ట్రంప్ ప్రతిపాదనను బహిరంగంగా తిరస్కరించిన మొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచింది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలలో ఇస్లామాబాద్ చేరడాన్ని తాను సమర్థించడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
అటువంటి ఒప్పందంలో చేరడం దేశ ‘ప్రాథమిక సిద్ధాంతాలకు’ విరుద్ధంగా ఉంటుందని ఆసిఫ్ తెలిపారు. దౌత్యపరంగా ఇజ్రాయెల్‌ను విశ్వసించవచ్చా అని కూడా ఆయన ప్రశ్నించడంతో, ఇస్లామాబాద్ వైఖరి మరింత స్పష్టమైంది. అయితే, ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలను అబ్రహాం అకార్డ్స్‌లో చేరాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ముందుగా సౌదీ, ఖతార్, తర్వాత పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్‌లు వారిని అనుసరించాలని సూచించారు.
ఇరాన్ కూడా చేరితే చాలా బాగుంటుందని పేర్కొన్నారు. కానీ, ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో మెజార్టీ ముస్లిం దేశాలు ఈ ఒప్పందాల్లో చేరడం కష్టమే.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేవరకూ ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణకరీంచడం సాధ్యం కాదని సౌదీ, ఖతార్ వంటి దేశాలు అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. 75 సంవత్సరాలకు పైగా, పాకిస్థాన్ పాలస్తీనా వాదనకు మద్దతు ఇస్తూ, ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించడానికి నిరాకతీస్తున్నది. తూర్పు జెరూసలంను రాజధానిగా చేసుకుని ఒక స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తేనే ఇజ్రాయెల్‌ను గుర్తిస్తామని పాకిస్థాన్ చెబుతోంది.

More Stories
రామమందిర `విరాళాల చోరీ’ దోషులను వదిలే ప్రసక్తి లేదు
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
జార్ఖండ్‌లో ఎన్డీఏ అభ్యర్థి నత్వానీ గెలుపుతో రాజ్యసభలో 2/3 ఆధిక్యత