`వికసిత్ భారత్’ కు ఒక కీలక వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్

`వికసిత్ భారత్’ కు ఒక కీలక వృద్ధి చోదకంగా  ఆంధ్రప్రదేశ్
‘వికసిత్ భారత్’ కు ఆంధ్రప్రదేశ్ ఒక కీలక వృద్ధి చోదకంగా ఎదిగే సామర్థ్యం ఉందని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.   విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు  రూ. 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తూ, శంకుస్థాపన చేసిన అందంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, రహదారి అనుసంధానం, ఇంధన భద్రత వంటి బహుళ రంగాల ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి ప్రశంసించారు. 
 
ఈ ప్రాజెక్టులు ‘స్వర్ణ ఆంధ్ర’ దార్శనికతకు దోహదపడతాయని, భారతదేశ వృద్ధి ప్రస్థానంలో రాష్ట్ర పాత్రను బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సాంస్కృతిక వైవిధ్యానికి, దేశీయ వారసత్వానికి ఇది ఒక వేడుక అని అభివర్ణిస్తూ, 13,000 మందికి పైగా గిరిజన మహిళలు, బాలికలు ధింసా నృత్య ప్రదర్శనలో పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. 
 
కొత్తగా ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, ఈ ప్రాంత యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరు మీద నిర్మించిన ఈ విమానాశ్రయం, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధిని పెంచుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. 
 
భారత విమానయాన రంగం వృద్ధిని ప్రస్తావిస్తూ, పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుండి 166కు పెరిగిందని, దీనివల్ల చిన్న నగరాల ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన ఉడాన్ పథకం విజయాన్ని కూడా హైలైట్ చేస్తూ, ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మరింత విస్తరించడానికి రూ. 29,000 కోట్ల పెట్టుబడితో దాని రెండవ దశను ప్రారంభించినట్లు తెలిపారు. 
 
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.  మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్‌వర్క్ మొత్తం విద్యుదీకరించబడిందని, ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానాన్ని మెరుగుపరచడానికి 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని ఆయన తెలిపారు.  విశాఖపట్నం నుండి కృష్ణపట్నం వరకు ఉన్న ఓడరేవులను ఆధునీకరించడం, మూలపేట, రామాయపట్నంలో కొత్త ఓడరేవులను అభివృద్ధి చేయడం, అలాగే విశాఖపట్నం-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేతో సహా రహదారి, ఎక్స్‌ప్రెస్‌వే మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా రాష్ట్ర నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రణాళికలను ప్రధానమంత్రి వివరించారు.
 
రవాణాను మెరుగుపరచడానికి, పారిశ్రామిక వృద్ధిని సులభతరం చేయడానికి, రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి , వ్యాపారం చేసే సౌలభ్యాన్ని పెంచడానికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ రైలు, రోడ్డు, ఓడరేవు,  విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అధునాతన తయారీ రంగంలో రాష్ట్రానికి ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ, విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం అనేది సాంకేతికత ఆధారిత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో, అధిక నైపుణ్యం గల ఉపాధి అవకాశాలను సృష్టించడంలో ఒక ప్రధాన ముందడుగు అని ప్రధాని మోదీ కొనియాడారు. 
 
ఆంధ్రప్రదేశ్‌పై పెరుగుతున్న ప్రపంచ ఆసక్తికి సూచికలని, గూగుల్ ప్రతిపాదించిన 15 బిలియన్ డాలర్ల క్యాంపస్‌తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లలో కొనసాగుతున్న పెట్టుబడులను కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి అదనంగా, నక్కపల్లిలో ఒక భారీ ఫార్మా పార్క్ అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇస్తోందని, అదే సమయంలో రాయలసీమ ప్రాంతానికి రూ. 5 లక్షల కోట్లకు పైగా పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను ఆకర్షించినట్లు ఆయన తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో తాను చేసిన గత మూడు పర్యటనల సందర్భంగా దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు, ఇది అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతోందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ తాజా ప్రాజెక్టులు విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని (విఈఆర్) బలోపేతం చేసి, దానిని ఆసియాలోని ప్రముఖ ఆర్థిక కేంద్రాలలో ఒకటిగా మార్చడంలో సహాయపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
తన ప్రసంగాన్ని ముగిస్తూ, నిరంతర ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు తయారీ రంగాన్ని ముందుకు నడిపిస్తాయని, ఎగుమతులను పెంచుతాయని, ఉపాధిని సృష్టిస్తాయని, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని, తద్వారా స్వర్ణ ఆంధ్ర,  వికసిత్  భారత్ అనే రెండు లక్ష్యాలకు దోహదపడతాయని ప్రధాని మోదీ చెప్పారు.  తొలుత, ప్రధాని మోదీ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి, అనంతరం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడులతో కలిసి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు.
 
ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు ఓ మణిహారమని, దీని ద్వారా ఈ ప్రాంత ప్రజల కలలకు రెక్కలు వచ్చాయని చంద్రబాబునాయుడు తెలిపారు.  ఉత్తరాంధ్రకు గూగుల్‌, స్టీల్‌ కంపెనీతో పాటు చాలా సంస్థలు వచ్చాయని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశాని, అలాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఇచ్చిన వ్యక్తి మోదీ అని సీఎం తెలిపారు.  ప్రధాని సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని చెబుతూ రూ.2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.