ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం.. సిఐడి దర్యాప్తుకు ఈసీ ఆదేశం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న ఏపీ ల్యాండ్ టైటలింగ్ చట్టం ఏపీ ఎన్నికలలో ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. ఈ చట్టంతో ప్రజల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని టిడిపి, జనసేన ప్రచారం చేస్తున్నాయి. ఈ చట్టంపై టిడిపి ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తుంది.

టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీఐడీ (సైబర్ సెల్)ను ఈసీ ఆదేశించింది. విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

“వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటలింగ్ చట్టం అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని సీఎం జగన్ వాదిస్తున్నారు.

భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్ గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొంటూ ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. 

భూ యజమాని వద్దే ఆస్తి పత్రాలు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ కాపీలు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది” అని సీఎం జగన్ గుర్తు చేశారు.