ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు

ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు
* కౌంటింగ్‌ తరువాత కూడా హింసాత్మక ఘటనలు.. కేంద్రం హెచ్చరిక
ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వం వహించనున్నారు. మరో 13 మంది పోలీస్‌ అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. 
 
పోలింగ్‌ రోజు, ఆ తరువాత రోజుల్లోనూ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, సిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రానికి సిట్‌ను ఏర్పాటు చేశారు. 
 
రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించడం, సిట్‌ ఏర్పాటు సమయానికే దాదాపుగా ఒక రోజు గడిచిపోవడంతో, ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే సిట్‌ సభ్యులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. శనివారం సాయంత్రానికి సాధ్యమైనంత వేరకు నివేదిక ఇవ్వడం లక్ష్యంగా సిట్‌ పని చేస్తోంది. దానికి వీలుగానే ఘర్షణలు జరిగిన ప్రాంతాలకు చెందిన పోలీస్‌ అధికారులకు సైతం సిట్‌లో స్థానం కల్పించారు. 
 
పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై సిట్‌ విచారణ జరపనుంది. తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్‌ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిట్‌ ఇచ్చే వివరాల ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే ఉద్యోగాల నుండి తొలగించే అవకాశమూ ఉందని సీనియర్‌ అధికారులు తెలిపారు. 
 
ముఖ్యంగా. తాడిపత్రి ఘటనలో డిఎస్‌పి చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారన్న అభిప్రాయం పోలీస్‌ ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై సిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాల్సిఉంది. హింసకు కారణమైన ముఖ్య నాయకులను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. సిట్‌కు విచారణ సమయంలో పూర్తిస్థాయి అధికారాలు కల్పించారు. గుర్తించిన అంశాల అధారంగా అవసరమైతే కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు అధికారం ఇచ్చారు.

మరోవంక, హింసాత్మక ఘటనలు కౌంటింగ్‌ తర్వాత కూడా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ మేరకు తగు భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులు పెద్దఎత్తున జరిగే అవకాశం ఉందని తెలిపింది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు సూచించాయి.