పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత

పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత
దేశ రక్షణ రంగ చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సరికొత్త మైలురాయిని చేరుకోబోతోంది. భారత్ గర్వపడేలా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ (ఎఎంసిఎ) తయారీకి పుట్టపర్తి వేదిక కానుంది.  ఈ భారీ ప్రాజెక్టుతో రాయలసీమ తలరాత మారబోతోంది పుట్టపర్తిలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  కేంద్ర రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ నెల 15న శంకుస్థాపన జరుగుతోందని చెప్పారు.

“వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సుమారు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టును ఇక్కడికి తీసుకురావడం అభినందనీయం. ఈ గొప్ప అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు” అని చెప్పారు. 
 
డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇలాంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు 600 ఎకరాలు భూమి సేకరణ అవసరం కాగా, మొదటి దశలో 150 సేకరణ దాదాపుగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం డి ఆర్ డి ఓకు సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించారని, ఇందులో రక్షణ రంగ దిగ్గజ సంస్థలైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలు భాగస్వాములుగా ఉంటాయని వివరించారు. 
 
ఈ కేంద్రంలో మొత్తం 140 యుద్ధ విమానాలను తయారు చేయాలన్నది లక్ష్యం. దీనివల్ల రాయలసీమ నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2027 నాటికి యుద్ధ విమానం యొక్క మొదటి మోడల్ సిద్ధం అవుతుందని,  2028లో తొలి ప్రయోగాత్మక గగన విహారం జరుగుతోందని,  2034 నాటికి: పూర్తిస్థాయి సర్టిఫికేషన్ పొంది వాయుసేనకు అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.  భవిష్యత్తులో పుట్టపర్తి దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన కేంద్రంగా మారుతుందని, స్థానిక సత్యసాయి విమానాశ్రయం కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించనుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా, దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని  విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టు రహిత భారతాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సుమారు 50 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ  ఇదే నిజమైన కమ్యూనిస్టు ముక్త భారత్‌కు సంకేతం అని స్పష్టం చేశారు.