యూరియా, డిఎపి వినియోగంపై నిఘాకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో గతేడాది కంటే ఈ ఏప్రిల్‌లో అధికంగా ఎరువులను అమ్మిన డీలర్లతో పాటు వాటిని కొనుగోలు చేసిన రైతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాలని సూచించారు. వీలైన మేరకు యూరియా, డిఎపి వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలకు కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఎరువులపై సబ్సిడీలను తగ్గించుకొనేందుకు నిరుడు రాష్ట్రాలకు టార్గెట్లు పెట్టింది. వాడకాన్ని తగ్గించిన వారికి పలు ప్రోత్సాహకాలు ఇస్తామంది. పిఎం ప్రణామ్ అనే పథకాన్ని ప్రకటించింది. నానో యూరియా, నానో డిఎపి, ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంలను ప్రోత్సహిస్తున్నది. సబ్సిడీ యూరియా రైతుల పేరిట వ్యవసాయేతర కార్యక్రమాలకు, పరిశ్రమలకు అక్రమంగా దారి మళ్లుతోందని పేర్కొంటూ దానిని అరికట్టేందుకు నిఘాను పటిష్టం కావించే చర్యలు చేపట్టారు.
కేంద్రం ఆదేశాలు రాగానే రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఎరువులపై నిఘాను తీవ్రతరం చేసింది. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, పౌరసరఫరాలు, ఇంటెలిజెన్స్ విభాగాలను రంగంలోకి దించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి మాసం ఏప్రిల్‌లో గతేడాది కంటే ఎక్కువ ఎరువులను విక్రయించిన డీలర్ల దుకాణాలను వివిధ ప్రభుత్వ విభాగాలు తనిఖీలు చేస్తున్నాయి.
ఈ చర్యలు సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పదుల సంఖ్యలో డీలర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్‌లు రద్దు చేసినట్లు తెలిసింది. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్‌టిఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం. యూరియా, డిఎపి ఎరువులను ఏప్రిల్‌లో కొనుగోలు చేసిన రైతుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. తరచు ఎరువులను కొనుగోలు చేస్తున్న వ్యక్తులను విచారిస్తుస్తోంది.

More Stories
పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత
దక్షిణ తీర రైల్వే జోన్ ఏపీ అభివృద్ధికి మైలురాయి
జూన్ 1 నుండి “దక్షిణ తీర రైల్వే”