పూంచ్‌ ఉగ్రదాడిలో పాక్ మాజీ కమాండర్

గతవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరుల ఫోటోలను దర్యాప్తు సంస్థలు సేకరించారు. వీరిలో ఒకరు పాకిస్థాన్ మాజీ సైనికుడి కావడం గమనార్హం.   పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాకిస్థాన్‌ ఉగ్రవాది హడూన్ (హదూన్), కోడ్‌ నేమ్‌ ఉన్న నిషేధిత లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జాగా గుర్తించారు.
 
ముగ్గురు ఉగ్రవాదులను ఇల్లియాస్‌తో పాటు లష్కరే తొయిబా కమాండోలు అబూ హమ్జా, హడూన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు తీవ్రవాదులు జైషే మహ్మద్ అనుబంధం సంస్థ కొత్తగా ఏర్పాటైప పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫోర్స్‌ (పిఏఎఫ్ఎఫ్) తరఫున ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసినట్లు సమాచారం. 
 
పూంఛ్ జిల్లాలో శనివారం సాయంత్రం సనాయ్‌ టాప్‌లోని స్థావరానికి వైమానిక దళ సైనికులు తిరిగి వస్తుండగా సురన్‌కోట్‌ ప్రాంతంలోని షాసితార్ వద్ద ముష్కర మూకలు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో భదత్రా బలగాలు భారీ గాలింపు చేపట్టాయి. 
 
ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి అనంతరం తీవ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో షహసితార్‌, గురుసాయ్‌, సనాయ్‌, షీన్‌దార్‌ ఎత్తైన కొండ ప్రాంతాలను సైన్యం జల్లెడ పడుతోంది. 
 
సైనిక కాన్యాయ్‌పై దాడికి రష్యాలో తయారైన ఏకే 47 రైఫిల్స్‌తో పాటు అమెరికా తయారీ ఎం-4 కార్బైన్‌ను, స్టీల్‌ బుల్లెట్ల వంటి అత్యంత బలమైన ఆయుధాలను వాడినట్లు గుర్తించారు. గతేడాది డిసెంబర్‌లోనూ సైనిక కాన్వాయ్‌పై పిఏఎఫ్ఎఫ్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు సైనికులు అమరులయ్యారు. ఆ దాడిలో కూడా స్టీల్‌ తూటాలు వాడినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. 
 
జమ్మూ కశ్మీర్ పోలీసులు విడుదల చేసిన వివరాల ప్రకారం అబూ హమ్జా వయసు 30 నుంచి 32 ఏళ్లు ఉంటుంది. చివరిసారిగా పఠాన్ సూట్ ధరించి, మెడలో గోధుమ రంగు మఫ్లర్, ఆరెంజ్ బ్యాగు చేతిలో ఉందని తెలిపారు. అతడి గురించి ఆచూకీ తెలియజేసేవారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. గత కొన్ని వారాలుగా పూంఛ్, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులు పెరుగుతూ ఉన్నాయి. 
 
రాజౌరీ ప్రాంతంలోని షాద్రా షరీఫ్‌లో ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ రజాక్‌ను ముష్కరులు కాల్చి చంపారు. ఆ దాడికి కూడా అమెరికా రైఫిల్, పిస్టల్‌ను వినియోగించారు. టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తోన్న రజాక్ సోదరుడు ఈ దాడిలో త్రుటిలో బయటపడ్డాడు. అతడ్ని కిడ్నాప్‌కు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడి వెనుక అబూ హమ్జా ఉన్నట్టు గుర్తించారు.