బ్రిజ్‌ భూషణ్ సింగ్‌ కు బిజెపి సీట్ నిరాకరణ!

మహిళా మల్లయోధులచే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కైసర్‌గంజ్‌ సిట్టింగ్‌ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్ శరణ్‌ సింగ్‌కు బీజేపీ షాకిచ్చినట్లు తెలిసింది. కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి బ్రిజ్‌ భూషణ్‌ను తప్పించి ఆ స్థానాన్ని ఆయన కుమారుడికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
ఈ మేరకు బీజేపీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. కైసర్‌గంజ్‌ సీటుపై బ్రిజ్‌ భూషణ్‌తో బీజేపీ నాయకత్వం ఫోన్‌లో మాట్లాడిందని, ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్ సింగ్‌కు లోక్‌సభ టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉందని సదరు వర్గాలు తెలిపాయి. ఇక ఈ స్థానానికి మే 20న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ జరగనుంది.
 
కాగా, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు స్టార్‌ రెజ్లర్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గదేడాది బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌ పునియా తదితరులు భారీ నిరసన చేపట్టారు. 
 
వీరి నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై జూన్‌ 2023లో కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు జూలై 20న బెయిల్‌ లభించింది. ప్రస్తుతం అతనిపై వచ్చిన అభియోగాలపై ఢిల్లీ కోర్టులో విచారణ కొనసాగుతన్న విషయం తెలిసిందే.