అద్భుత ఆధ్యాత్మిక కట్టడం అయోధ్య రామ మందిరం

జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ర్టాల కళాకారులు, కార్మికులు పాలుపంచుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ఆలయానికి, శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి.

ప్రస్తుత రామ మందిరం డిజైన్‌ 1989లోనే రూపుదిద్దుకున్నది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోమ్‌పుర కుటుంబీకులు ఈ డిజైన్‌ను అందించారు. అప్పటి వీహెచ్‌పీ అధిపతి అశోక్‌ సింఘాల్‌ విజ్ఞప్తి మేరకు, ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకొన్నారు.

 కానీ, అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్‌ రూపొందించారు. ప్రధాన ఆలయాన్ని ఎల్‌ అండ్‌ టీ కంపెనీ నిర్మించగా, ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ నిర్మిస్తున్నది. 

అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2,500 ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకొనేలా డిజైన్‌ చేసినట్టు ఆర్కిటెక్ట్‌ ఆశీశ్‌ సోంపురా తెలిపారు. ఆయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు.

 భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2,587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. 

వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయోధ్యలో ఓ చిన్న టైలర్‌ దుకాణం (బాబూ లాల్‌ టైలర్స్‌)ను నడుపుతున్న సోదరులు భగవత్‌ ప్రసాద్‌ పహాడీ, శంకర్‌ లాల్‌ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్యవస్ర్తాలను తయారు చేస్తున్నారు. 

3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌దాస్‌ శ్రీరాముడికి వస్ర్తాలు కుట్టే పనిని భగవత్‌ ప్రసాద్‌ తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్ర్తాలు సమకూరుస్తున్నది. ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగానే, రామమందిరంలోని బాల రాముడి విగ్రహంమీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తున్నది.

గర్భగుడిలో ప్రతిష్ఠించే బాల రాముడి ఎత్తు 51 అంగుళాలు. ఐదేండ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేసింది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకొన్నది. ప్రస్తుతం అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది. తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది.

మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్‌పురంలో 30 ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు.

 గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్‌ను సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్‌ డిపో నిర్వాహకులు దక్కించుకొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ మందిర సముదాయం ఉంటుండగా, ప్రధాన ఆలయం 2.77 ఎకరాలలో నిర్మితమవుతుంది. 320 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తైన శిఖరంతో, 12 ప్రవేశ ధ్వారాలతో ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయ సముదాయంలో ఏకకాలంలో 10 లక్షల మంది వరకు ఉండవచ్చు.

రామ మందిరం నిర్మాణం వ్యయం రూ 400 కోట్లు కాగా, మొత్తం సముదాయ నిర్మాణం పూర్తి అయ్యేందుకు రూ 1800 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేస్తున్నారు. 2026 నాటికి మొత్తం సంపూర్ణ నిర్మాణం పూర్తవుతుంది.