పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మవిభూషణ్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును గురువారం సాయంత్రం స్వీకరించారు. 
 
ఈ కార్యక్రమానికి చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి విచ్చేశారు. అందుకోసం బుధవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు చిరంజీవి.  భారత గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. 
 
డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీని మరణాంతరం ఈ పురస్కారంతో గౌరవించారు. హోర్ముస్జీ ఎన్‌.కామా పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

ఏప్రిల్‌ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి, మిగతా వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా, వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవి, సీనియర్‌ నటీమణి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్కు పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

దివంగత జస్టిస్‌ ఫాతిమా బీవీ, కేంద్ర మాజీమంత్రి రామ్‌నాయక్‌, మరో కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మ, నటుడు మిథున్‌ చక్రవర్తి, కోలీవుడ్ దివంగత నటుడు విజయ్‌కాంత్‌ సహా పలువురికి కేంద్రం పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది.

పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గతంలో మాట్లాడుతూ “ఈ అవార్డు ప్రకటించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ప్రేక్షకులు నాపై చూపించిన బేషరతు ప్రేమకు నిదర్శనం. మీ అందరికీ రుణపడి ఉంటాను. నాకు తోచిన రీతిలో కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించాను. అది ఎంత చెప్పినా తక్కువే” అని తెలిపారు.

నాలుగున్నర దశాబ్దాలుగా చిరంజీవి 150కిపైగా సినిమాల్లో నటించారు.  2006లోనే పద్మభూషణ్ అవార్డు అందుకున్న చిరు ఆ తర్వాత కొన్నాళ్లకే రాజకీయాల్లో ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఉమ్మడి ఏపీలో18 సీట్లు కూడా గెలుచుకున్నారు.  ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.