ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు

* హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు!

ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు మద్దతు ఉపసంహరించుకొని, కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో మనోరిటీలో పడిన హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష జరపాలని లేదా రాష్ట్రపతి పాలన విధించాలని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో పాటు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, జెజెపికి చెందిన నలుగురు ఎమ్యెల్యేలు మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను గురువారం కలవడం రాష్ట్ర రాజకీయాలలో నాటకీయ పరిణామాలకు దారితీస్తుంది. 

పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్‌, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హర్యానా ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై వారు చర్చించారు. జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలను కలవడం ఆ పార్టీలో చీలికగా వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రభుత్వానికి సభలో సరైన బలం లేదని, వెంటనే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని జెపిపి నేత దుశ్యంత్ చౌతాలా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు. ఇండిపెండెంట్ల మద్దతుతో ఇంతకు ముందు ప్రభుత్వం గట్టెక్కిందని, కానీ ఇప్పుడు వారు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, ఇక ఈ సర్కారు మైనార్టీలో పడిందా? లేదా అనేది గవర్నర్ నిర్థారించాల్సి ఉందని, బలపరీక్షకు సెషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చౌతాలా డిమాండ్ చేశారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార అనిశ్చిత నెలకొందని, రాష్ట్రపతి పాలన విధించాలని, మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని పార్టీ డిమాండ్ చేసింది. కాగా తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి నాయబ్ సైని ప్రకటించారు.

 తాము మార్చిలోనే సభలో విశ్వాస తీర్మానంలో గెలిచామని, మరోసారి సమయం వస్తే సత్తా నిరూపించుకుంటామని ఆయన తెలిపారు. దుష్యంత్ చౌతాలాకు ధైర్యముంటే ఆయన బలం ఎంతో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత ఎంఎల్ ఖట్టర్ స్పందిస్తూ బిజెపి సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదని, పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నామని చెప్పారు.

90 మంది సభ్యులు గల రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం వాస్తవంగా 88 మంది  ఉండగా,బిజెపికి 40, కాంగ్రెస్ కు 30, జెజెపికి 10 మంది  ఎమ్యెల్యేలు ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర సభ్యులలో  మద్దతు ఇస్తున్నారు. అంటే బిజెపి బలం 43 గా ఉండగా, మరో ఇద్దరి మద్దతు అవసరం ఉంది.