ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు!

* కేజ్రీవాల్‌ కేసులో ‘సుప్రీం’లో ఈడీ అఫిడవిట్‌
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. చట్టం అందరికీ సమానమేనని ఎన్నికల ప్రచారం అనేది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక, చట్టబద్ధమైన హక్కు కాదని పేర్కొంది.  ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా గురువారం ఇడి తరఫున ఆ సంస్థ డిప్యుటీ డైరెక్టర్ భాను ప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కానప్పటికీ తమకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఇడి తెలిపింది.  ఏ రాజకీయ నాయకుడు ప్రత్యేక హోదాను క్లెయిమ్ చేయలేరని, నేరాలకు పాల్పడితే ఇతర పౌరుల మాదిరిగానే రాజకీయ నాయకులను అరెస్టు చేయవచ్చని ఈడీ స్పష్టం చేసింది.  ఆప్ అధినేత మధ్యంతర బెయిల్ కోరడంపై ఇడి మండిపడుతూ గతంలో కూడా సమన్లను తప్పించుకోవడానికి కేజ్రీవాల్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయంటూ ఇదే సాకు చూపారని తెలిపింది.
 
 ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మజూరు చేస్తే ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం సాధ్యం కాదని ఇడి వాదించింది. గడచిన మూడేళ్లలో దాదాపు 23 ఎన్నికలు జరిగాయని, ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇస్తే ఇక ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి తరలించలేమని ఇడి తన అఫిడవిట్‌లో పేర్కొంది.
 
ఎన్నికల ప్రచారానికి మాత్రమే కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సమానత్వ పాలనకు విరుద్ధమని దర్యాప్తు సంస్థ అఫిడవిట్‌లో పేర్కొంది. మంగళవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అని, అతడు సాధారణ నేరస్తుడు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.   ఇదిలా ఉండగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.  అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అదే రోజు నిర్ణయం తీసుకోనున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. =

మరోవంక, కేజ్రీవాల్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్‌  రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ కేసులో కేజ్రీవాల్‌ను తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలిపాయి. ఈ కుంభకోణంలో కేజ్రీ ‘కీలక సూత్రదారు’గా పేర్కొంటూ రూపొందించిన ఛార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.