ఎస్‌బీఐకి 3 నెలల్లో రూ.20,698 కోట్ల లాభం

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గత ఆర్థిక ఏడాది 2023- 24 చివరి త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించింది. మార్చి 31, 2024 తో ముగిసిన క్యూ4 లో ఎస్‌బీఐ నెట్ ప్రాఫిట్ 24 శాతం పెరిగి రూ. 20,698 కోట్లుగా నమోదు చేసింది. 
 
గతేడాది ఇదే సమయంలో ఎస్‌బీఐ లాభం రూ. 16,694 కోట్లుగా ఉంది. మార్కెట్ అంచనాలను మించి ఎస్‌బీఐ లాభాలను నమోదు చేయడం గమనార్హం. నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలు ఆర్జించిన క్రమంలో ఎస్‌బీఐ బోర్డు డివిడెండ్‌కు సిఫార్సు చేసింది. ఒక్కో షేరుకు రూ. 13.70 డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 
 
అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు సంబంధించిన రికార్డు తేదీని మే 22, 2024 గా నిర్ణయించింది. అంటే మే 22 నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో షేర్లు కలిగి ఉన్న వారికి ఒక్కో షేరుకు రూ. 13.70 డివిడెండ్ అందనుంది. ఈ డివిడెండ్ చెల్లింపులు  జూన్ 5, 2024న వాటాదారులకు పంపిణి చేయనుంది.  క్యూ4లో ఎస్‌బీఐ వివిధ రుణాల ద్వారా పొందిన వడ్డీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ. 1,11,043 కోట్లుగా నమోదు చేసింది. 
 
గతేడాది వడ్డీ ఆదాయం రూ. 92,951 కోట్లుగా ఉంది. అలాగే వివిధ రకాల డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ రూ.69,387 కోట్లుగా ఉంది. అంతుకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 32 శాతం పెరిగింది. ఎస్‌బీఐ డిపాజిట్లు క్యూ4లో రూ. 49,16,077 కోట్లు నమోదయ్యాయి. అలాగే గ్రాస్ నిరర్ధక ఆస్తులు 7 శాతం తగ్గి రూ. 84,276 కోట్లకు తగ్గాయి. నెట్ ఎన్‌పీఏ 2 శాతం తగ్గి రూ.21,051 కోట్లుగా నమోదైంది.
 
నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనపై సానుకూల సంకేతాలు ఉన్న క్రమంలో ఎస్‌బీఐ షేరు గురువారం లాభాల్లో ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి 1.13 శాతం లాభంతో రూ.820 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 811.90 వద్ద ప్రారంభమైన ఈ స్టాక్ ఒక దశలో రూ. 803.55 కనిష్ఠ స్థాయికి పడిపోయి మళ్లీ పుంజుకుంది. దీంతో సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 839.65 ను తాకింది. క్యూ4 ఫలితాలు అంచనాలను మించిన క్రమంలో సరికొత్త గరిష్ఠాలను తాకడం గమనార్హం. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ స్టాక్ ఫోకస్ లో ఉండనుంది.