ఎయిర్​ఇండియా సిబ్బంది సమ్మె విరమణ

ఎయిరిండియా యాజమాన్యం, విమాన సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లు కనబడుతోంది. 2 రోజులుగా ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడి సెలవు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిరిండియా 25 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మరింత మందిని తొలగిస్తామన్న హెచ్చరికతో, ఉద్యోగులు దిగివచ్చారు. సమ్మెను విరమించారు. ఈక్రమంలో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సహా వారిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు ఎయిరిండియా యాజమాన్యం అంగీకరించినట్లు తెలిసింది.

తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న 300 మంది సిబ్బంది సామూహిక సెలవు పెట్టడం వల్ల వందల సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సిబ్బంది తీరుపై ఆగ్రహించిన యాజమాన్యం, 25 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామనీ, గురువారం సాయంత్రంలోగా మిగిలిన వారు విధుల్లో చేరకుంటే మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్‌ సిబ్బందిలోని ఒక వర్గంలో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 300 మంది క్యాబిన్‌ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఎక్స్‌ఈయూ) ఆరోపణలు చేసింది. 

కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలను ఇవ్వటం సహా సిబ్బంది మొత్తాన్ని సమానంగా చూడడం లేదని చెప్పింది. సంస్థలో మొత్తం 1,400 మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు. వీరిలో 500 మంది సీనియర్‌ లెవెల్‌ ఉద్యోగులు ఉన్నారు.

అయితే అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంపై బుధవారం ఉదయం పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిర్​ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. సెలవులో ఉన్న తమ సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.