తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోందో..? లేక అధికారంలోకి రావటానికి ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే.. కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, ఇస్తోన్న హామీలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాము మరోసారి అధికారంలోకి వస్తే.. ముస్లిం యువత కోసం ప్రత్యేకంగా ఓ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని మహేశ్వరం పర్యటనలో భాగంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఈ ముస్లిం ఐటీ పార్క్ ఏర్పాటు కాబోతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే.. ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎన్నికల్లో గెలవటానికి ఇలాంటి దారుణమైన హామీలు కూడా ఇస్తారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవంగా ఐటీ రంగంలో విభిన్నమైన విభాగాలకు సంబంధించి.. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐటీ పార్కులు పెట్టటం జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ ఏకంగా మత ప్రాతిపదికన ముస్లిం ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం.. అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా ఐటీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
వాస్తవానికి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఇప్పటికే ముస్లింలు ఉన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన కాకుండా.. ప్రతిభ ఆధారంగానే ఐటీ నిపుణులు ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అటువంటప్పుడు.. కేవలం మత ప్రాతిపదికన, అందులోనూ ముస్లింల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్క్‌ను కేసీఆర్ ఎలా నిర్మిస్తారన్నది ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఐటీ పార్కులు, హబ్స్ ఉన్నాయి.. కానీ, ఎక్కడా ముస్లిం ఐటీ పార్క్ అనేదే లేదు. ఏ ఐటీ కంపెనీ కూడా మత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయటం లేదు.. ఆర్డర్లు పొందటం లేదు. మరి అలాంటప్పుడు.. తెలంగాణలో ముస్లిం ఐటీ పార్క్ పెడతానని కేసీఆర్ హామీ ఇవ్వటం పూర్తిగా ఎన్నికల స్టంట్‌గా ఐటీ రంగ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ముస్లింల ఓట్లు కావాలంటే వాటిని అడగటానికి అనేక మార్గాలు ఉన్నాయని.. కానీ ఇలా ఈ స్థాయిలో దిగజారి ప్రకటనలు చేయటం ఏంటని..? తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు