రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వీణా వాణిలాగా అవిభక్త కవలలు

రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వేర్వేరు కాదని, వారిద్దరు వీణా వాణిలాగా అవిభక్త కవలలని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు అభివర్ణించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నారనీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే.. రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు అడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

కేసీఆర్ తీసుకు వచ్చిన జీవో 51ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందంటూ సీఎం రేవంత్ అంటున్నారని,  అలాగే బిజెపి రాజ్యాంగాన్ని మారుస్తోందని రేవంత్ చెబుతున్నారని చెప్పారు. 10 ఏళ్లుగా మోదీ అధికారంలో ఉన్నారని.. ఆ సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేయలేదని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.

అయితే రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరణ చేశారో తాను చర్చకు సిద్దమని.. మీరు సిద్దామా? అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రఘునందన్ రావు సవాల్ విసిరారు.  భారత రాజ్యాంగం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉందని ఎద్దేవా చేశారు.

రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. సాక్షాత్తు రాజ్యాంగం రాసిన డా. బీఆర్ అంబేడ్కర్ మళ్లీ పుట్టి వచ్చినా రాజ్యాంగం మార్చడం కుదరదని స్పష్టం చేశారు.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీనేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 

ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. జై శ్రీరాం అంటే ఏమైనా తప్పా.. జై కేసీఆర్ అనమని చెబుతావా? అంటూ బీఆర్ఎస్ అధినేతపై రఘునందనరావు తనదైన శైలీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిందూ గాళ్లు.. బొందు గాళ్ళు అంటేనే నీ బిడ్డను ఓడగొట్టారని కేసీఆర్‌కు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

 జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? అని కేసీఆర్ అంటున్నారని.. మరి అయిదు సార్లు నమాజు చదివితే కడుపు నిoడుతుందా? అని వ్యంగ్యంగా రఘునందన్ రావు ప్రశ్నించారు. యజ్ఞాలు, యాగాలు చేసి ప్రసాదం తీసుకోమంటవు కదా? అంటూ కేసీఆర్‌కు  చురకలంటించారు. 

మోదీ  అధికారంలో ఉన్న పదేళ్లలో ఉన్న రిజర్వేషన్కు తోడు మరో పదిశాతం కల్పించిందని పేర్కొంటూ ఉన్న రిజర్వేషన్లతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. అలాగే ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని మార్చబోరని స్పష్టం చేస్తూ  రాజ్యాంగ సవరణ జరుతుంది తప్ప సంవిధానాన్ని మార్చడం జరగదని ప్రధాని మోదీ  చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.