అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలకు పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీల‌కు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు..
హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. . మైనార్టీల రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను షేర్ చేసిన పలువురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్‌ షా ఇటీవల తెలంగాణ పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే, షా ప్రసంగాన్ని పలువురు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరోవైపు ఫేక్‌ వీడియోపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. ఈ మేరకు నకిలీ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపింది. అలాగే ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్  దర్యాప్తు చేపట్టింది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి హెచ్చరిక చేశారు.