గోవధ పట్ల నిర్లక్ష్యం వహిస్తే బరిలోకి భజరంగ్ దళ్

బక్రీదు సందర్భంగా తెలంగాణాలో గోవధ పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బజరంగ్ దళ్ బరిలోకి దిగుతుందని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సొంతంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని గో అక్రమ రవాణాను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఈనెల 14వ తేదీన ఇందిరాపార్కు దగ్గర మహా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.

పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, గోరక్ష దక్షిణ భారత ప్రముఖ్ యాదగిరి రావు, గోరక్ష తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ్ జి రమేష్, పరిషత్  ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు విలేకరులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలో ఒక్క గోవును కూడా అక్రమంగా వధించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం మంత్రి గారికి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే ధర్నా గోడపత్రికలను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

పాడి పరిశ్రమకు, వ్యవసాయానికి, గ్రామీణ జీవన విధానానికి వెన్నెముకగా ఉన్న పశువులను చట్ట వ్యతిరేకంగా హత్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.  ప్రతి ఏడాది బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గో హత్యలు కొనసాగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

బక్రీద్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గోవులను, పశువులను రవాణా చేసే సందర్భంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని, అయితే అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆవులను వధిస్తున్న కూడా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. 

బలిష్టంగా ఉన్న జంతువులను కూడా వధిస్తున్నారని.. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా గోవధ విచ్చలవిడిగా రెట్టింపు స్థాయిలో సాగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం  పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం చట్ట విరుద్ధమని చెప్పారు.