రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు

 
* అవసరం ఉన్నంత వరకు అవి కొనసాగాల్సిందే
 
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్‌ఎస్‌ ఎప్పుడూ వ్యతిరేకించలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
అనంతరం రిజర్వేషన్లకు ఆర్ఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తమపై తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్నారని డా. భగవత్  ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సమాజంలో భేదభావాలు పోయేవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని హితవు పలికారు.“రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమని ఒక వీడియో వైరల్‌ అవుతోంది. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదు. అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలి. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడాలి.” అని తెలిపారు.

 ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలనేదే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. దీనితో పాటు 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

 మరోవంక,  రిజర్వేషన్ సహా పలు అంశాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. వాయనాడ్‌లో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

రిజర్వేషన్లపై రాహుల్ దుష్ప్రచారం

కాగా, బీజేపీ మూడోసారి అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గిస్తార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంత‌వ‌ర‌కూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేష‌న్ల‌పై పున‌రాలోచ‌న ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

రాహుల్ గాంధీ త‌మ‌పై దుష్ప్ర‌చారం సాగిస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. తాము ప‌దేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామ‌ని రిజ‌ర్వేష‌న్ల‌కు స్వ‌స్తి ప‌లకాల‌ని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణ‌యం తీసుకునేవార‌మ‌ని అమిత్ షా పేర్కొన్నారు.

రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసే ఆలోచ‌న త‌మ‌కు లేనేలేద‌ని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నంత‌వ‌ర‌కూ రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గించే అధికారం, ద‌మ్ము ఎవ‌రికీ లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే బీసీలు, ద‌ళితులు, ఆదివాసీ సోద‌రుల‌కు భ‌రోసా ఇచ్చార‌ని ఆయ‌న గుర్తుచేశారు.