మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌

* మరోసారి కాల్పుల ఘటన 
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు.
 
పోలింగ్ రద్దయిన 6 కేంద్రాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడానికి ముందే గుర్తుతెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ధ్వంసం చేశారు. ఒక పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ మిషన్‌లో సమస్యలు తలెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులు, భయాల మధ్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తి కాలేదు.

మణిపూర్‌లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లోనూ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. సుమారు 3,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగగా, 11 పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈవీఎంలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించిన ఈసీ రెండో విడత పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహించింది.

అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యానికి నిరసగా కుకీ-జోమి తెగకు చెందిన పలు పౌర సమాజ సంస్థలు, గ్రూపులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ‘నో జస్టిస్ నో ఓట్’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించినట్టు ఆ గ్రూపులు ప్రకటించాయి. 

ఇలా ఉండగా, మణిపూర్‌లో ఆదివారం మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి.  మణిపూర్‌లోని ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మొయితీ వర్గాలకు చెందిన వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్‌పోక్పీ జిల్లాల్లోని కౌత్రుక్‌ గ్రామంపై కొండపై నుండి సాయుధ దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని చెప్పారు.  

కొన్ని బుల్లెట్లు గ్రామస్తుల ఇళ్లను నాశనం చేశాయని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా తయారయ్యే పంపి అని పిలిచే మోర్టార్‌ షెల్స్‌ను గ్రామంపై ప్రయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.   అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈనెల 26న ఇంఫాల్‌ తూర్పు సరిహద్దులోని సినామ్‌ కోమ్‌ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ప్రమాదంలో  33 ఏళ్ల గ్రామ వాలంటీర్‌  మృతి చెందాడు. మణిపూర్‌లో 2023 మే నుంచి మెయితీలు, కుకీల మధ్య జాతుల వైరం భగ్గుమని హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60,000 మందికి పైగా నిరాశ్రయిలయ్యారు.