మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి కన్నుమూత

టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో దయాకర్ రెడ్డి బాధపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచి దయాకర్‌రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
దయాకర్‌రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురం. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశారు.  దయాకర్ రెడ్డికి టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు.
దయాకర్ రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దంపతులిద్దరికి టీడీపీతో మంచి అనుబంధం ఉంది.  దయాకర్‌రెడ్డి దంపతులు గతేడాది ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినా.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరలేదు. ఇద్దరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
 
దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, సమర్థుడైన నాయకుడుగా దయాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.  దయాకర్ రెడ్డి గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. 
 
దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.  దయాకర్ రెడ్డి మృతిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దయాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.