ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్‌ఐబీ చీఫ్ కోసం పిటిషన్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టు కోసం ఐపిసి 73 కింద వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నోటీసులో ప్రభాకర్ రావు నాన్ బెయిలబుల్ సెక్షన్‌లో ప్రధాన అనుమానితుడని కోర్టుకు పోలీసులు వెల్లడించారు. 

అతను అరెస్టును తప్పించుకునే ఉద్దేశంతోనే విదేశాలకు వెళ్లిపోయాడని పోలీసులు కోర్టుకు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పని సరిగా మారిందని పోలీసులు కోర్టుకు పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారానికి విచారణ వాయిదా వేసింది. 

73 వారెంట్‌కు కోర్టు అనుమతిచ్చిన వెంటనే ప్రభాకర్ రావుకు ప్రభుత్వ అనుమతితో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి పాస్ పోర్ట్ స్టాంపింగ్ ద్వారా అతను ఉన్న దేశంలోని పోలీసులకు అరెస్ట్ వారెంట్ సమాచారం ఇచ్చి అతనిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకరావాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో పార్ట్-2 మొదలవుతుందని పోలీసులు వర్గాలు చెబుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇదిలా ఉండగా, లోక్ సభ ఎన్నికల వేళ రాధాకిషన్ రావు వాంగ్మూలం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారిన క్రమంలోనే బిఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల వేళ ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా బిఆర్‌ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీపై నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించు కోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్‌లో వెల్లడించింది. అయితే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.