తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన

తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇంతకుముందు కేసీఆర్‌ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి హామీల అమలు బదులు గాడిదగుడ్డు ఇస్తున్నారని విమర్శించారు. 
 
రేవంత్‌ ఎక్కడకు వెళ్లినా చెయ్యి గుర్తు బదులు గాడిద గుడ్డును తలపై పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌.. చెయ్యి గుర్తు నుంచి గాడిద గుడ్డు గుర్తుకు మారినట్లుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్‌ అవినీతి మార్కును చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన పోయి.. సోనియా కుటుంబ పాలన వచ్చిందని, మార్పు అంటే ఇదేనా? అని రేవంత్‌ను నిలదీశారు. 
 
100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో వాస్తవాలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో రైల్వేల కోసం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. ప్రధాని మోదీ వచ్చాక ఎన్ని నిధులు ఇచ్చామో అనేదానిపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు.
 
కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఇంతవరకు నిర్మించలేదు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టిండు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.
 
28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా తెలంగాణ ప్రజల బతుకు మారిందని తెలిపారు. 
 
తెలంగాణలో కేసీఆర్ పీడ పోవాలని ప్రజలు ఓడిస్ మరో భయంకరమైన, దుర్మార్గమైన, అబద్ధాల, గాడిదగుడ్డు పాలన వచ్చిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 5 నెలల పాలనలో ఒక్క తెల్ల రేషన్ ఇచ్చింది లేదు. కాని తెల్లరేషన్ కార్డులు ఇచ్చినట్లు హోర్డింగులతో అడ్వర్టైజ్ మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు రూ. 10 లక్షల ప్రమాద బీమ ఇవ్వలేదని గుర్తు చేశారు.

100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామంటూ, దావోస్ నుంచి రూ. 40 వేల 232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారంటూ, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల బీమా కల్పించినట్లు మెట్రో పిల్లర్లపై హోర్డింగులతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బిజెపి నేత మండిపడ్డారు.  రీజినల్ రింగురోడ్డును సైతం కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని చెబుతూ రీజినల్ రింగురోడ్డుకు కర్త,కర్మ,క్రియ బిజెపినే అని స్పష్టం చేశారు.

పంటల బీమా పథకం పునరుద్ధరణ అంటూ అబద్ధాలు చెప్తోందని చెప్పారు. 800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్ ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభిస్తే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోందని తెలిపారు.
రూ.58000 కోట్లతో మూసీ అభివృద్ధి అన్నరు… నిధులు విడుదల చేసింది లేదని చెప్పారు.

గ్యారెంటీలలో మరొకటి మహిళలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారని పేర్కొంటూ ఎంతమందికి ఇచ్చారు..?  అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రూ.500 కే సిలిండర్ అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలోనూ అందరికి కాదు.. కొందరికే అంటూ కండిషన్లు పెట్టిందని దుయ్యబట్టారు.

ప్రగతి భవన్ కంచెలు కూల్చి ప్రజా భవన్ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. కంచెలు కూల్చారు తప్పితే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తీసుకొని సమస్యలు పరిష్కరించిందిలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.  ప్రజావాణి దరఖాస్తులు తీసుకుని ట్రంకుపెట్టెలో పెట్టారు… మరికొన్ని చోట్ల ప్రజావాణి దరఖాస్తులు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయి. ప్రజావాణికి ముఖ్యమంత్రి హాజరైంది లేదని విమర్శించారు.