సికింద్రాబాద్ లో నాలాలో పడి చిన్నారి మృతి

సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి ముక్కపచ్చలారని బాలిక మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసం అన్నతో కలిసి బయటకు వచ్చిన మౌనిక (6) నీటిలో కొట్టుకుపోయింది.  శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు నదులను తలపించాయి. నాళాలు పొంగిపొర్లాయి. కొద్దిసేపు వర్షం ఆగడంతో అప్పుడే లేచిన మౌనిక (6) తన అన్నతో కలిసి కిరాణా షాపుకు పాలపాకెట్ కోసం బయటకు వచ్చింది. ఈ సమయంలో రోడ్డుపై వర్షపు నీరు పారుతోంది.
 
ఈ నీరంతా అక్కడే తెరిచిఉన్న నాలాలోకి ప్రవహిస్తోంది. అయితే నాలా తెరిచి ఉందని మౌనిక, ఆమె అన్న గమనించలేదు. ఓ  గోడను పట్టుకుంటూ అన్న చెల్లెలు కిరాణా షాపు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మౌనిక అన్న కాలు జారి మ్యాన్ హోల్ దగ్గర పడ్డాడు.  అన్న పడిపోవడంతో అతన్ని కాపాడటానికి మౌనిక ప్రయత్నించి నాలాలో పడిపోయింది. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో ఆ ధాటికి మౌనిక కొట్టుకుపోయింది. 
మౌనిక పడిన నాలా దగ్గర గత నాలుగు రోజులుగా పనులు జరుగుతున్నాయి. అందుకే నాలాను తెరిచారు.  కానీ అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం మరిచారు. ఇదే మౌనిక పాలిట శాపమైంది. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే మౌనిక మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ” మీ వల్లే మా అమ్మాయి చనిపోయింది.. మీ నిర్లక్ష్యం వల్లే నా పాప నాకు దూరం అయ్యింది” అంటూ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎదుట చిన్నారి మౌనిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఘటనాస్థలికి పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించి.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
నాలా హోల్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జీహెచ్ఎంసీ తరుపున బాధిత కుటుంబానికి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటనను జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకొని, ఘటనకు కారులకులైన వారిపై వేటు వేసింది. వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణతో పాటు బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్యను  సస్పెండ్ చేశారు.
 
కళాసిగూడ వెళ్లిన బాలిక గల్లైంతైన ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చిన్నారి మౌనిక మృతి చాలా బాధకరమని చెబుతూ బీజేపీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మౌనిక మృతి చెందిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ సమన్వయ లోపం వల్లే ఇవాళ ఓ ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో ధర్నాలు చేస్తున్నారని చెబుతూ జీహెచ్ఎంసీ వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని కేంద్ర మంత్రి విమర్శించారు.