‘ది కేరళ స్టోరీ’ మరో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కానుందా?

కేరళకు చెందిన ‘ఐఎస్ఐఎస్ వధువులు’ ఆధారంగా రూపొందుతున్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్ నాలుగు రోజుల క్రితం విడుదలైనప్పుడు రాజకీయ దుమారం రేపింది.  మే 5న విడుదల కానున్న ఈ చిత్రం ఇదివరకు `ది కాశ్మీర్ ఫైల్స్’ మాదిరిగా దేశంలో మరో సంచలనం సృష్టించగలదా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
 
 గతంలో ఆంఖేన్, వక్త్, నమస్తే లండన్ వంటి మల్టీస్టారర్ బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించి, సింగ్ ఈజ్ కింగ్ వంటి చిత్రాలను నిర్మించిన
 విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.  కేరళ స్టోరీకి సృజనాత్మక దర్శకుడు, సహ రచయిత కూడా వ్యవహరించారు. యదార్ధ గాద ఆధారంగా నిర్మించిన చిత్రమని, కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేసి, వారిని ఐఎస్ఐఎస్ లో చేర్చుకునే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు.
 
ఈ చిత్రంలో నటి అదా శర్మ కథానాయిక. ఆమె ఇస్లాం మతంలోకి మారి, వివాహం చేసుకుని, అక్రమ రవాణాకు గురైన షాలిని ఉన్నికృష్ణన్ అనే పాత్రలో నటించింది. ఈ చిత్రం సాధారణ కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుండి ప్రపంచంలోని అత్యంత అపఖ్యాతి పాలైన తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా)లో చేరిన నలుగురు మహిళల గురించి అని తెలుస్తున్నది.
 
ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. అదా హిందువు అయిన షాలినిగా పరిచయం చేయబడి, హిజాబ్ ధరించిన ముస్లిం స్నేహితురాలి  ద్వారా హిజాబ్, ఇస్లామిక్ ఆరాధనలను స్వీకరించేలా తారుమారు చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తదుపరి సన్నివేశంలో షాలిని ఐఎస్ఐఎస్ లో ఎలా చేరిందని ఏజెన్సీలు ప్రశ్నించినట్లు చూపిస్తుంది.
 
ట్రయిలర్‌లో ఇస్లామిక్ మత గురువులు ముస్లిమేతర బాలికలను సంబంధాల ద్వారా మతమార్పిడికి గురిచేయడానికి యువకులు,  యువతుల బృందాన్ని నడిపిస్తున్నట్లు చూపబడింది. ట్రైలర్‌ని విడుదల చేసిన ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని స్పందనలు ఎక్కువగా సానుకూల అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి.
 
యూట్యూబ్‌లోని ఒక వినియోగదారు ఇలా వ్రాశారు: “కేరళకు చెందిన సిరియన్ క్రిస్టియన్‌గా, కేరళ ఐఎస్ఐఎస్ కేసు వాస్తవ సంఘటనలను చిత్రీకరించడానికి ఈ ధైర్యమైన చర్య తీసుకున్నందుకు చిత్ర  బృందానికి నా కృతజ్ఞతలు…” మరో వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఒక కేరళీయుడిగా, చిత్ర నిర్మాతల ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను.”
 
ఇంకొకరు “గూస్‌బంప్స్, కన్నీళ్లు…” అని రాశారు. కేరళ నుంచి 32,000 మంది మహిళలు మతమార్పిడి చేయబడి అక్రమ రవాణాకు గురయ్యారని టీజర్‌లో పేర్కొనడంతో నవంబర్‌లో ఈ చిత్రం వివాదానికి దారితీసింది. గతంలో కేరళ ముఖ్యమంత్రులు ఊమెన్‌ చాందీ, వీఎస్‌ అచ్యుతానందన్‌లు చేసిన ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను పేర్కొనడం జరిగింది.
 
తమిళనాడుకు చెందిన ఒక జర్నలిస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి షా వాదనకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించే వరకు సినిమాను నిషేధించాలని పిటిషన్ వేశారు. ట్రైలర్ ఆ క్లెయిమ్ చేయలేదు. బురఖా ధరించిన మహిళను చూపించే పోస్టర్‌తో చిత్రనిర్మాతలు సోమవారం విడుదల తేదీని ప్రకటించారు. `దాగిన నిజాన్ని వెలికితీయడం’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. ‘ఐఎస్ఐఎస్ వధువులను’ వారు పుట్టిన దేశంలోకి తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ చిత్రం వస్తుంది.
 
ఈ మహిళలు ఐఎస్ఐఎస్ యోధులను వివాహం చేసుకున్నారు.  తమ  భర్తలతో కలిసి జీవించడానికి ఆఫ్ఘనిస్తాన్,  సిరియాలలో ఐఎస్ఐఎస్  నిర్వహించే శిబిరాలకు వలస వచ్చారు. తరచుగా ఐఎస్ఐఎస్ లక్ష్యాలకు నేరుగా మద్దతు ఇస్తారు. షమీమా బేగం 15 ఏళ్ల వయసులో ఐఎస్ఐఎస్ వధువుగా జీవించడానికి దేశం విడిచిపెట్టిన తర్వాత బ్రిటన్ ప్రవేశం నిరాకరించగా, కేరళకు చెందిన నలుగురు మహిళలకు కూడా భారత ప్రభుత్వం ప్రవేశం నిరాకరించింది.
 
చిత్రంలోని నలుగురు మహిళలు సోనియా సెబాస్టియన్ అలియాస్ అయేషా, రఫాలా ఇజాస్, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా. ఈ సినిమాను నిషేధించాలని ఆలిండియా ముస్లింజమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి డిమాండ్ చేశారు.
 
ఇక మొన్నటి వరకు దేశంలో వివాదంగా ఉన్న హిజాబ్ ప్రస్తావనను కూడా ఈ చిత్రంలో తీసుకొచ్చారు. మరి నిజంగా కేరళలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే అవుననే పలు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేరళలో ఐఎస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని, అక్కడి ముస్లిం యువతీయువకులను ఉగ్రవాదంపైపు మళ్లించే ప్రయత్నాలు జరిగాయని గతంలోనే  ఎన్ఐఏ వెల్లడించింది. 2009-2012 మధ్య కాలంలో మతమార్పిడికి గురైనవారిలో 2667మంది యువతులున్నారని, వారిలో 2195మంది హిందువులు కాగా,  492 మంది క్రిస్టియన్లు ఉన్నారని తెలిపింది.