టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు!

ఈ ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి టీ20 ప్రపంచకప్‌  ప్రారంభం కాబోతోంది. దీంతో ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంచకప్‌కు జట్లను ప్రకటించాయి. ఇక ఈ పొట్టి సమరానికి మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నీకి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వెస్టిండీస్‌ బోర్డుకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రధాన ఈవెంట్లను లక్ష్యంగా చేసుకుంటామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ బెదిరించింది.
 
ఐఎస్‌కి చెందిన మీడియా గ్రూప్ ‘నాషీర్ పాకిస్థాన్’ ద్వారా ప్రపంచకప్‌కు ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారం అందిందని కరీబియన్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు ఉగ్రదాడి బెదిరింపుల నేపథ్యంలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అప్రమత్తమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ స్పందిస్తూ.. ‘ప్రపంచకప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
నిర్వాహక దేశాల్లో ఒకటైన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే మాట్లాడుతూ ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం బాధగా ఉందని తెలిపారు.  21వ దశాబ్దలోనూ ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం బాధాకరమని చెబుతూ విభిన్న మార్గాల్లో ఉగ్రవాదం వ్యాపిస్తుందని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు మంచిది కాదని పేర్కొన్నారు. 
 
ఉగ్రవాదంపై పోరాడేందుకు అన్ని దేశాలు సమాయత్తం కావాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రమాల్లో ఒకటైన వరల్డ్‌కప్‌ను నిర్వహించే అవకాశం తమకు దక్కడం గర్వంగా ఉందని చెప్పారు. అందివచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మెగా టోర్నీని అత్యంత విజయవంతంగా నిర్వహిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.
 
 ప్రపంచకప్ ముగిసే వరకు మ్యాచ్‌లు జరిగే వేదికలు, పర్యాటక కేంద్రాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెగా టోర్నీని సాఫీగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని పేర్కొంటూ దీని కోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంస్థలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు. 
 
ఇక వరల్డ్‌కప్‌లో పాల్గొనే ప్రతి ఆటగాడికి వ్యక్తగత భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు.  మరోవైపు ఐసిసి కూడా వరల్డ్‌కప్‌ను ఎలాంటి అవరోధాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. టోర్నీలో పాల్గొనే దేశాలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడాలని కోరింది. ప్రతి క్రికెటర్‌కు పూర్తి భద్రత ఉంటుందని ఐసిసి అధికారులు హామీ ఇచ్చారు.