చివరి నిమిషంలో సునీత విలియమ్స్ స్పేస్​ మిషన్​ రద్దు!

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్ చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్​ కంపెనీకి చెందిన స్టార్​లైనర్​ రాకెట్​లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్​ని నిలిపివేశారు! తొలి మానవసహిత స్టార్​లైనర్​​ మిషన్​ని బోయింగ్​ కంపెనీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనవరాల్‌ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లవలసి ఉంది. ఇందులో మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్న సునీతా విలియమ్స్‌ (58) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ వారం రోజులపాటు గడపవలసి ఉంది.
ఈ రోదసి యాత్రకు తాము సిద్ధంగా ఉన్నామని, మూడోసారి అంతరిక్షయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని సునీతా విలియమ్స్‌  అంతకు ముందు తెలిపారు. ఈ యాత్ర విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని తీసుకెళ్లి, తీసుకొచ్చిన రెండవ ప్రైవేట్‌ సంస్థగా బోయింగ్‌ ఆవిర్భవించెడిది.

కానీ ఈ మిషన్​కి అడుగడుగునా అడ్డంకులు ఎదరవుతూ వచ్చాయి. ఫలితంగా రాకెట్ లాంచ్​ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో సునీత విలియమ్స్​ 3వ స్పేస్​ మిషన్​ రద్దు అయ్యింది. అట్లాస్​ వీ రాకెట్​ పైభాగంలోని వాల్వ్​లో అనుమనాస్పద ప్రవర్తన కారణంగా.. లాంచ్​కి కొన్ని గంటల ముందు కౌంట్​డౌన్​ని నిలిపివేశారు.

ఈ అట్లాస్​ వీ రాకెట్​ని.. బోయింగ్​-లోక్​హీడ్​ మార్టిన్​ జాయింట్​ వెంచర్​ అయిన యునైటెడ్​ లాంచ్​ అలయెన్స్​ రూపొందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత.. కాప్సూల్​లోని సిబ్బంది.. మేన్యువల్​గా ఆపరేట్​ చేసి, దీని శక్తిసామర్థ్యాలను లెక్కిస్తారు.  ఈ లాంచ్​ మళ్లీ ఎప్పుడు ఉంటుంది? అనేది బోయింగ్ ఇంకా చెప్పలేదు. కానీ బ్యాకప్​ తేదీలు మే 7, మే10, మే11గా ఉన్నాయి.

మానవసహిత రాకెట్​ లాంచ్​ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్​ తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సునీత విలియమ్స్​, బుచ్​ విల్​మోర్​లు ఈ మిషన్​ కోసం ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్​ స్టేషన్​కి వెళ్లి, తిరిగి వెనక్కి రావడం ఈ మిషన్​లో భాగం. లాంచ్​కి రెడీ అయిన సునీత విలియమ్స్​, బుచ్​లు సీట్లల్లో కూర్చుని లిఫ్ట్​ ఆఫ్​కు సిద్ధమయ్యారు. కానీ మిషన్​ని రద్దు చేయాల్సి వచ్చింది.

“ఇవాల్టి లాంచ్​ని నిలిపివేస్తున్నాము. మేము ముందు చెప్పినట్టు.. మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెడీగా ఉన్నప్పుడే వెళతాము,” అని నాసా చీఫ్​ బిల్​ నెల్సన్​ తెలిపారు. సేఫ్టీ విషయంలో బోయింగ్​ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు స్టార్​లైనర్​ లాంచ్​ రద్దు అవ్వడం.. కమర్షియల్​ ఏవియేషన్​ విభాగంపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.