ర‌ఫా నుంచి ఇజ్రాయిల్ ల‌క్ష మంది త‌ర‌లింపు

ఈస్ట్ర‌న్ ర‌ఫా నుంచి పాల‌స్తీనా పౌరుల్ని ఇజ్రాయిల్ ఆర్మీ త‌ర‌లిస్తున్న‌ది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల‌ని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. గాజా సిటీలో భారీ ఆప‌రేష‌న్‌కు ప్లాన్ చేసిన నేప‌థ్యంలో ఈ ఆదేశాల‌ను ఇచ్చారు. సుమారు ల‌క్ష మంది పాల‌స్తీనియ‌న్ల‌ను ర‌ఫా నుంచి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. 

ఖాన్ యూనిస్‌, అల్ మావాసి న‌గ‌రాల దిశ‌గా ఆ జ‌నం వెళ్తున్నారు. ప్ర‌జ‌ల్ని వెళ్ల‌గొట్టేందుకు ఇజ్రాయిల్ ద‌ళాలు వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. టెక్ట్స్ మెసేజ్‌లు, ఫ్ల‌య‌ర్స్‌, సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు సందేశాల‌ను చేర‌వేస్తున్నారు. తూర్పు ర‌ఫాలో ఉన్న హ‌మాస్ ద‌ళాల్ని త‌రిమేందుకు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్ర‌తినిధి తెలిపారు. 

ర‌ఫా న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకుంటేనే హ‌మాస్‌తో పోరులో విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంద‌ని ఇజ్రాయిల్ భావిస్తున్నది. అయితే ప‌ది ల‌క్ష‌ల మంది పాల‌స్తీనియ‌న్లు ఆ ప్రాంతంలో ఉండ‌డం వ‌ల్ల‌.. అక్క‌డ దాడి జ‌రిగితే ప్రాణ‌నష్టం అధికంగా ఉంటుంద‌ని ప‌శ్చిమ దేశాలు హెచ్చ‌రిస్తున్నాయి.  ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం గత ఏడునెలలుగా కొనసాగుతున్నది. హమాస్‌ను తుదముట్టించాలని ఇజ్రాయెల్‌ సంకల్పించింది. ఇప్పటి వరకు యుద్ధంలో 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, అన్ని దేశాలు కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తూ వచ్చాయి. 

ఈ క్రమంలో తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ చర్చలకు ఇజ్రాయెల్ స్వస్తి పలికింది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన క్రాసింగ్ పాయింట్‌పై హమాస్ ఆదివారం భారీ దాడిని ప్రారంభించింది. మానవతా సహాయ ట్రక్కుల కోసం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌ను మూసివేయాలని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం నిర్ణయించింది.

అదే సమయంలో హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్, సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ బలగాల గుంపును లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇజ్రాయెల్ సైన్యం కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా జరిపిన దాడిలో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద పది రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాడి జరిగిన వెంటనే క్రాసింగ్‌ను మూసివేయాలని ఇజ్రాయెల్‌ సైన్యం నిర్ణయించింది. తాజాగా హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ మళ్లీ బయటకు వచ్చి గాజాను తన అధీనంలోకి తీసుకుని, బంకర్లు నిర్మించే పరిస్థితిని అంగీకరించలేమని పేర్కొన్నారు. 

తమ పౌరుల భద్రతను ప్రమాదంలో పడవేయలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను సైతం ఆయన తోసిపుచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎలాగైనా తమను అంతం చేయాలనుకుంటున్న శత్రువుతో తాము పోరాడుతున్నామని.. అంతర్జాతీయ నేతలకు తాను చెప్పేది ఒక్కటేనని.. ఏ ఒత్తిడి, అంతర్జాతీయ నిర్ణయాలు తమను స్వీయరక్షణ చర్యలు తీసుకోకుండా ఆపలేవని స్పష్టం చేశారు.