అగ్నికి ఆజ్యం పోసిన శామ్‌పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన

* వారసత్వ పన్నుపై భారత్ లో ఎన్నో ప్రయోగాలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను పంపిణీ చేసేస్తుందంటూ బీజేపీ పెద్దఎత్తున విరుచుకుపడుతున్న సమయంలో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావనతో ఆ అగ్నికి ఆజ్యం పోశారు. ‘‘అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే.. అతని వారసులకు 45ుమాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55 శాతం  ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం’’.. అంటూ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అందివచ్చిన ఆయుధంలా మారాయి! 

సంపదను సృష్టించినవారు అందులో సగం ప్రజలకు వదిలి వెళ్లిపోవడం తనకు న్యాయమేననిపిస్తోందని.. భారత్‌లో అలాంటిదిలేదని, సంపన్నుల ఆస్తి మొత్తం పిల్లలకే వెళ్తుందని పిట్రోడా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రచారంలో కాంగ్రె్‌సపై దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ  పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పలువురు బీజేపీ నేతలూ పిట్రోడా వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 

దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడింది. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని.. పార్టీకి వాటితో సంబంధంలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. ఆ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీకిగానీ, పార్టీ మేనిఫెస్టోకిగానీ ఎలాంటి సంబంధం లేదని పిట్రోడా తెలిపారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై ప్రధాని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

వాస్తవానికి శామ్‌పిట్రోడా పేర్కొన్నట్టుగా సంపన్నులు చనిపోతే వారి ఆస్తిలో 55 శాతం ప్రభుత్వ ఖజానాకు చెందేలా ఫెడరల్‌ చట్టమేదీ లేదు. ఆ దేశంలో 50 రాష్ట్రాలుండగా 6 రాష్ట్రాల్లో మాత్రమే (అయోవా, కెంటకీ, మేరీలాండ్‌, నెబ్రాస్కా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా) వారసత్వ పన్ను ఉంది. ఆ ఆస్తి విలువను బట్టి ఒక శాతంకన్నా తక్కువ నుంచి గరిష్ఠంగా 18ుదాకా మాత్రమే ఉంది. 

ఆ పన్ను కూడా అందరికీ వర్తించదు. ఉదాహరణకు.. చనిపోయిన వ్యక్తి భార్యకే ఆస్తి మొత్తం వెళ్తే ఈ పన్ను వర్తించదు. ఇలా బోలెడన్ని షరతులు.. మినహాయింపులు ఉంటాయి. పిట్రోడా ఇవేవీ పట్టించుకోకుండా యథాలాపంగా 55 శాతం అంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రె్‌సను ఇబ్బంది పెడుతోంది.

ఈ సందర్భంగా ఆదాయ అసమానతలను పరిష్కరించడానికి సంపద పునఃపంపిణీ సాధనంగా వారసత్వ పన్నును ఉపయోగించడం గుర్తించి  విస్తృతంగా చర్చకు అవకాశం ఏర్పడింది. అయితే వారసత్వ పన్ను అంశం భారత్ కు కొత్తది ఏమీ కాదు. గతంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. గతంలో ఇటువంటి పన్ను అమలులో ఉండెడిది. 

ఎస్టేట్ డ్యూటీగా పిలిచే ఈ పన్నును 1953లో ప్రవేశ పెట్టగా,  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో రద్దు చేసింది. భారతదేశంలో సంపద పన్ను, బహుమతి పన్ను కూడా ఉన్నాయి. వాటిని వరుసగా, 2015, 1998లలో రద్దు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బడ్జెట్ తయారీ సమయంలో కూడా వారసత్వపు పన్నును తిరిగి ప్రవేశపెట్టడం గురించి కొంత చర్చ జరిగింది.

ఇప్పుడు రద్దైన ఎస్టేట్ సుంకం రూ. 1 లక్ష థ్రెషోల్డ్‌తో వారసత్వ పన్ను,రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఎస్టేట్ ప్రధాన విలువపై 5% నుండి 40% వరకు ఉండెడిది.  1958లో సవరించారు. దాని రద్దు తర్వాత కూడా, వారసత్వ పన్ను ఆలోచనఅధికారిక, అనధికారిక చర్చల్లో భాగంగా  సజీవంగానే ఉంది.

డిసెంబర్ 2018లో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలలోని ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు,  ఇతర సంస్థలు వారసత్వ పన్ను వంటి కారణాల వల్ల పెద్ద మొత్తంలో ఎండోమెంట్‌లను పొందుతాయని, అయితే భారతదేశంలో ఈ పద్ధతి ప్రబలంగా లేదని పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో సంపద పన్నును రద్దు చేసి దాని స్థానంలో సూపర్ రిచ్‌పై సర్‌చార్జిని ప్రకటించింది. రూ. 30 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆస్తులపై (ఈక్విటీలు, బాండ్లు,మొదటి ఇల్లు మినహా) సంపద పన్ను 1% ఉండగా, 2013-14లో మొత్తం సంపద సేకరణ కేవలం రూ. 1,008 కోట్లు మాత్రమేనని జైట్లీ చెప్పారు.

రూ. 1 కోటి,అంతకంటే ఎక్కువ పన్ను విధించదగిన ఆదాయం కలిగిన వ్యక్తులపై 2% అదనపు సర్‌చార్జి విధించారు, దీని వల్ల రూ. 9,000 కోట్ల ఆదాయాలు వస్తాయని అంచనా. 1985-86 బడ్జెట్ ప్రసంగంలో, అప్పటి ఆర్థిక మంత్రి వి పి సింగ్ ఆస్తిపై పన్ను కోసం రెండు వేర్వేరు చట్టాల ఉనికి – మరణానికి ముందు సంపద పన్ను, మరణం తర్వాత ఎస్టేట్ సుంకం – పన్ను చెల్లింపుదారులపై “విధానపరమైన వేధింపులకు” సమానమని పేర్కొన్నారు.

సంపద అసమాన పంపిణీని తగ్గించడం, రాష్ట్రాలు తమ అభివృద్ధి పథకాలకు ఆర్థిక సహాయం చేయడం వంటి ఎస్టేట్ డ్యూటీ లక్ష్యాలను సాధించలేదని కూడా ఆయన తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి మార్చి 2024 నాటి నోట్‌లో, సంపదపై పన్ను రేట్లు సాధారణంగా గత దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా క్షీణించాయి, సగటు కార్పొరేట్ ఆదాయపు పన్ను రేట్లు క్షీణించడం అన్ని ఆదాయ స్థాయిలలోని దేశ సమూహాలలో ముఖ్యమైన భాగం అని తెలిపింది.

నేటి ప్రధాన సమస్య ఆదాయ అంతరాయాలు విపరీతంగా పెరిగి పోతూ ఉండటం, సంపద కేవలం కొద్దీమంది వద్ద కేంద్రీకృతం అవుతూ ఉండటం కారణంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న అత్యధిక ప్రజల జీవితాలలో మార్పు తీసుకు రాలేకపోతున్నది. ఉపాధి అవకాశాలను పెరుగు పరచలేకపోతున్నది.

ఈ సందర్భంగా, ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్పడం ప్రమాదకరమని పేర్కొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం 1986లో మహారాష్ట్ర గృహ నిర్మాణ, ప్రాంత అభివృద్ధి చట్టం-1976కు చేసిన చట్ట సవరణ అంశాన్ని బుధవారం సుప్రీంకోర్టు విచారిస్తున్న  సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
 ‘ప్రైవేటు ఆస్తి సంపూర్ణంగా ప్రైవేటుదే అని చెప్పేది పూర్తిగా పెట్టుబడిదారీ భావన అవుతుంది. అలాగే ఏ ఆస్తి కూడా వ్యక్తులకు మాత్రమే పరిమితమైనదని కాదని, ఆస్తులన్నీ సమాజానివని చెప్పేది పూర్తిగా సామ్యవాద దృక్పథం. మన దేశానిది పూర్తిగా సామ్యవాద పద్ధతి కాదు. ప్రైవేటు ఆస్తి అనేది ఉంటుంది. అయితే, సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ వనరులే అని, వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు ఆస్తులు సమాజ వనరులు కావని చెప్పడం కూడా సరికాదు. ఇలాంటి ఆలోచన ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు.