ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ  సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. 1985లోనే రద్దు చేసిన వారసత్వపు పన్ను చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని మోదీ ఎద్దేవా చేశారు. మతప్రాతిపదికన ప్రజలను విభజిస్తూ కాంగ్రెస్ దేశం చేతులు నరికివేసిందని ఆరోపించారు.

“1985లో తన తల్లి ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు రాజీవ్ గాంధీ వారసత్వపు పన్ను, చరవాణి, స్థిరాస్తులపై విధించిన లెవీని రద్దు చేశారు. ఆ చట్టాన్ని మళ్లీ తెస్తే అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారు. ప్రజల ఆస్తిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వానికి హక్కు ఉండాలని అంటోంది” అంటూ విమర్శించారు. 

ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకుండా చట్టాన్ని రద్దు చేసి.. ఇప్పుడు అదే పార్టీ నేతలు మళ్లీ చట్టం కావాలని అంటున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. అలాంటి పని బీజేపీ ఎన్నడూ చేయదని స్పష్టం చేశారు.  నాలుగు తరాలు తమకు అందజేసిన సంపదలో లబ్ధి పొందిన తర్వాత ఇప్పుడు మరింత శక్తివంతంగా పన్నును పటిష్టం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.

బీజేపీ ఉన్నంత కాలం అలాంటి ఎత్తుగడలను విజయవంతం చేయనివ్వబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలు పడుతూ మీరు కూడబెట్టుకున్న సంపద కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక మీ నుంచి కొల్లగొడతామంటున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని దోచుకోవాలన్న కాంగ్రెస్‌ ఎత్తుగడకు, మీకు మధ్య మోదీ గోడలా నిలుస్తున్నారని భరోసా ఇచ్చారు.

బీజేపీకి దేశం కంటే ఏదీ పెద్దది కాదని, కాంగ్రెస్‌కు సొంత కుటుంబమే ప్రధాన ప్రమాణమని మోదీ వంశపారంపర్య రాజకీయాలను ప్రస్తావిస్తూ స్పష్టంగా చెప్పారు. ముస్లిం వర్గాల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోందని ప్రధాని హెచ్చరించారు.  మతపరమైన బుజ్జగింపుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటోందని ధ్వజమెత్తారు. 

బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందజేస్తోందని ప్రధాని గుర్తు చేశారు. ఏ ముస్లింకైనా రేషన్ అందలేదని ఎప్పుడైనా విన్నారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, విద్య.. మత ప్రాతిపదికన ఇవ్వకూడదని నిర్ణయించారని ప్రధాని చెప్పారు. 

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మతపరమైన కోటాను వ్యతిరేకించారని మోదీ గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ దానిని బ్యాక్ డోర్ ద్వారా ఇచ్చి వెన్నుపోటు పొడిచిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది ముస్లింలను రహస్యంగా ఓబీసీ కేటగిరీలో చేర్చిందని విమర్శించారు. 

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రధాని మండిపడ్డారు. ఓబీసీల హక్కులను లాక్కోవడానికి కాంగ్రెస్ తమ అభిమాన ఓటు బ్యాంకును(ముస్లిం) బలోపేతం చేసేందుకు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోందని మోదీ ఆరోపించారు.