దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి

దేశం సుభిక్షంగా, భద్రత‌గా ఉండాలంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ  కావాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పిలుపిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై కమలం వికసించేందుకు తోడ్పడాలని కోరారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన నాయకుడు ప్రధాని మోదీ అని తెలిపారు.

గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ మైదానంలో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో  ముఖ్య అతిథిగా పాల్గొంటూ  బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ రెండూ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకేలా ఉంటోందని, ఆ రెండు దొందు.. దొందేనని ధ్వజమెత్తారు. 

దేశంలో కాంగ్రెస్ కు, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు, ప్రజలను దోచుకోవడానికి, ఓట్లు అడగడానికి వస్తున్నాయని చెబుతూ అభివృద్ధిపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.  ఉత్తరకాండ్ ప్రాంతం గంగోత్రి, యమునా, భద్రీనాథ్, కేదార్నాథ్ దేవతలు కొలువు దిరిన ప్రాంతమని చెబుతూ ఆ ప్రాంతాలను పూర్తిగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని స్పష్టం చేశారు. 

ఎంపీ ధర్మపురి అరవింద్ సమర్థవంతుడని, ప్రధాని మోదీ సహకారంతో నిజామాబాద్ జిల్లాని ధర్మపురి అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. ఈ సభలో ఇంతమంది ఉత్తేజం, జోష్ ని చూస్తుంటే నిజా మాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో ధర్మపురి అరవింద్ ని గెలిపిస్తారని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నినా 400 సీట్లతో అత్యధిక మెజార్టీతో కేంద్రంలో బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశంలో ప్రజలు అయోధ్య రాముడి దర్శనం కోసం వందల సంవత్సరాల నుంచి ఎదురుచూసేవారని పేర్కొంటూ 500 సంవత్సరాల కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపారు. దివ్య రాముడి ఆశీస్సులతో మరోసారి ప్రధాని మోదీ కావడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. 

పసుపు బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అరవింద్ విమర్శించారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు వస్తదని.. నరేంద్ర మోదీ వచ్చి ఇందూరు గడ్డపై చెప్పిపోయారని గుర్తు చేశారు. దీన్ని నిజామాబాద్ తీసుకొచ్చే బాధ్యత తనది అని ఎంపీ స్పష్టం చేశారు. జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకున్నామని.. కొత్త రైల్వే లైన్లు తెచ్చుకున్నామన్నారు.
రానున్న కాలంలో మరిన్ని రైల్వే లైన్లు తెస్తామని హామీ ఇచ్చారు. జక్రాన్ పల్లి ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్‌ఆర్‌ఐల మీద దొంగ ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమీషాల సహకారంతో పసుపు బోర్డు సాధనలో ఎంపీ అరవింద్ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అల్జాపూర్ శ్రీనివాస్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.