కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం

కాళేశ్వరం  బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై అవసరం అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పిలిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తామని ఈ అంశాలపై విచారణకు కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్ సారధి జస్టిస్ చంద్ర గోష్ తెలిపారు. 
 
గురువారం నుండి తన విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రజల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తామని తెలిపారు. విచారణలో నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
 
 ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్టులను కూడా దృష్టిలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లతో త్వరలోనే భేటీ అవుతామని, ఎన్డీఎస్ఏ అథారిటీతో కూడా సమావేశం అవుతామని స్పష్టం చేశారు. టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తామని చెప్పారు. 
 
తాను స్వతహాగా ఇంజనీర్‌ని కాదని.. తనకు అందరి సహాయ సహకారాలు అవసరమని వివరించారు. తాను ముఖాలను చూసి విచారణ చేయనని, లీగల్ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని, తమకు కావాల్సిన సహాయ సహకారాలను తీసుకొని విచారణ చేస్తామని వివరించారు. 
 
లీగల్ సమస్యలు తలెత్తకుండా విచారణ కొనసాగిస్తామని, ఏమైనా ఇబ్బంది అయితే స్టే వచ్చే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఇస్తామని స్పష్టం చేశారు. రెండో విడతలో భాగంగా మేడిగడ్డ గ్రౌండ్‌కు వెళ్లి బ్యారేజీలను పరిశీలిస్తామని వివరించారు. 
 
ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని, చాలా విషయాలను తెలుసుకున్నామని తెలిపారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని, దాంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చంద్ర ఘోష్ పేర్కొన్నారు.