తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి

తెలంగాణలో బీజేపీని కనీసం 12 లోక్ సభ స్థానాల్లో గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. అప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఎందుకంటే మీరు ఆయనకు ఇచ్చే ప్రతి ఓటు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెళుతుందని చెప్పారు.
 
మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటూ  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపోయాయని చెబుతూ కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారని అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ దోస్తీ చేసిందని ధ్వజమెత్తారు.
 
బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుమ్మక్కయ్యాయని, అందుకే కాళేశ్వరం కుంభకోణం అయినా, భూ కుంభకోణం అయినా బిఆర్ఎస్ చేసిన అవినీతిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదని అమిత్ షా విమర్శించారు. నరేంద్ర మోదీని దేశానికి మూడోసారి ప్రధానమంత్రిని చేస్తే తెలంగాణను అవినీతి నుండి విముక్తి పొందుతుందని ఆయన హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారని విమర్శించారు.తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని షా హామీ ఇచ్చారు.
 
అయోధ్యలో రామమందిరం కోసం ప్రధాని మోదీ కృషి చేశారని చెబుతూ  కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేసేందుకు మోదీ ఎంతో చేశారని హోంమంత్రి పేర్కొన్నారు. మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్‌ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందని చెబుతూ బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తప్పకుండా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
 
ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించామని చెబుతూ జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించామని చెప్పారు.  కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి, మెదక్ లతో సహా దేశవ్యాప్తంగా కమలాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.