సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి

ఇటీవల చత్తీస్ ఘడ్ లోని కాంకేర్ లో జరిగిన పోలీసు ఎదురుకాల్పులలో మృతి చెందిన మావోయిస్టు నాయకుడు సుధాకర్ @ శంకరన్న  గ్రామానికి (జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా) వెళ్లి మావోయిస్టుకు నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి దన్సరి అనసూయ @ సీతక్కపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలని ఉగ్రవాద వ్యతిరేక వేదిక డిమాండ్ చేసింది.
 
ఆ మేరకు వేదిక చైర్మన్ డా. రావినూతల శశిధర్ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం పై ప్రమాణం చేసిన ఒక క్యాబినెట్ మంత్రి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిషేదానికి గురైన దేశద్రోహ మావోయిస్టులను సమర్ధించేలా ప్రవర్తించడం రాజ్యాంగ ఉల్లంఘన కింద భావించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
 మంత్రి చర్యలు చట్టవ్యతిరేఖంగా,భద్రతా బలగాల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. మాజీ నక్సలైట్ గా చరిత్ర ఉండి పోలీసులకు లొంగిపోయి, ప్రస్తుతం ప్రజా క్షేత్రంలో ఎమ్యెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటూ మావోయిజంపై సానుభూతి ప్రకటిస్తున్న సీతక్క లాంటి వారు క్యాబినెట్ లో ఉంటే ప్రభుత్వ రహస్యాలు గోప్యంగా ఉంటాయనే నమ్మకం ప్రజలు, సెక్యూరిటీ బలగాలు కోల్పోయాయని ఆయన స్పష్టం చేశారు. 
 
 కాబట్టి వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, ఆమె పైన ఉన్న కేసులను పునః విచారణ జరిపి మావోయిస్టు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాజీ పడితే సమాజ భద్రతకు పెనుముప్పు ఎదురవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రి సీతక్క వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు, భారత రాష్ట్రపతికి కూడా లేఖ వ్రాస్తున్నట్లు ఆయన తెలిపారు.