
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు గురువారంతో ముగియడం, పైగా, మొదటి రెండు విడతల ఎన్నికల ప్రచారం కూడా ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు తెలుగు రాస్త్రాలలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. ఈ రాస్త్రాలలో గరిష్టంగా సీట్లు గెల్చుకొనేందుకు బిజెపి పట్టుదలతో పనిచేస్తున్నది.
తెలుగు రాస్త్రాలలో ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 30వ తేదీతో పాటు వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.
30వ తేదీన హైదరాబాద్ లో వివిధ రంగాల్లో ప్రముఖలతో మోదీ సమావేశం అవుతారు. అదేరోజు అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. మే 3వ తేదీన వరంగల్, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. 4వ తేదీన మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు.
ఇదే సమయంలో ఏపీలోనూ ప్రచారం పైన ప్రధాని దృష్టి సారిస్తున్నారు. ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. కాగా, ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రిలలో ప్రధాని సభలు ఉంటాయని భావిస్తున్నారు. విశాఖలో రోడ్ షో నిర్వహణపైన పార్టీల నేతలు చర్చలు చేస్తున్నారు. అనకాపల్లి, రాజమండ్రిలో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రధాని ప్రచారం పైన బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో చర్చలు చేస్తున్నారు. ప్రధానితో సహా బీజేపీ నుంచి ముఖ్య నేతల పర్యటన పైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటనపై కూటమి నేతలు నిర్ణయానికి వచ్చిన తరువాత అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు.
More Stories
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం