బిజెపి మహిళా చేతిలో ఓవైసీ ఓటమి ఖాయం

రాహుల్, ఓవైసీ ది ఔరంగజేబు స్కూల్ అంటూ “రాహుల్ గాంధీ మా పార్టీ మహిళా నేత చేతిలో ఓడిపోయారు. అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాద్ లో మా పార్టీ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయం” అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత నామినేషన్ దాఖలు కార్యక్రమంలో, ఆ తర్వాత రోడ్ షో లో పాలగోన్న ఆయన ప్రజాస్పందన చూస్తుంటే ఇక్కడ బిజెపి విజయం తధ్యమని తెలుస్తుందని తెలిపారు. అసదుద్దీన్ 5 నిమిషాలు టైమిస్తే చాలంటారు..అక్బరుద్దీన్ గోవులను కోసుకుని తినండని మాట్లాడుతారని ధ్వజమెత్తారు.

మరి, ఓవైసీ బద్రర్స్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు? అని కేంద్ర మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పాలనలో మహిళలకు రిజర్వేషన్లపై బిల్లు ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సహా నిందితులంతా జైలుకెళ్లారని చెబుతూ  కుంభకోణం కేసులో కవిత నిర్ధోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదు? అని ఠాకూర్ ప్రశ్నించారు. తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లు ఢిల్లీకి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.

కర్ణాటకలో సొంత పార్టీ కార్పొరేటర్ అయిన ఓ ఆడబిడ్డకు న్యాయం చేయలేని రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.  మహిళల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో హిందూ మహిళల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉందే తప్ప చర్యలు తీసుకోలేదని కేంద్ర మంత్రి విమర్శించారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డ కాంగ్రెస్ చేతిలో దేశం ఎలా భద్రంగా ఉంటుంది? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని పేర్కొంటూ ఆ పార్టీ అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని ఠాకూర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.  రానున్న ఎన్నికల్లో వయనాడ్ లో రాహుల్ గాంధీ ఓడిపోతున్నారని స్పష్టం చేశారు.  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలవడానికే తిప్పలు పడుతోందని చెబుతూ  60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే నరేంద్ర మోదీ పాలనలో అనేక రెట్ల అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు.