తెలంగాణాలో ఇంటర్ ఫలితాల విడుదల

తెలంగాణాలో  ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్‌ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్‌‌, సెకండ్‌ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
 
ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో కామారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 71.7శాతం ఉత్తీర్ణత సాధించగా కామారెడ్డిలో 34.81 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా  నుంచి 71297మంది పరీక్షలకు హాజరైతే 51121మంది ఉత్తీర్ణత సాధించారు. కామారెడ్డి జిల్లా  నుంచి 7658మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2666మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

రెండో స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది. మేడ్చల్ జిల్లాలో 64,828మంది ఇంటర్ పరీక్షలకు హాజరైతే 46,407మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.58శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ములుగు జిల్లా విద్యార్థులు నిలిచారు. ములుగు జిల్లా నుంచి 1717 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైతే 70.01శాతంతో 1202మంది ఉత్తీర్ణత సాధించారు.

నారాయపేటలో 44.3శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా నుంచి 3781మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరైతే 1675మంది ఉత్తీర్ణత సాధించారు. చివరి నుంచి రెండో స్థానంలో నారాయణ పేట జిల్లా నిలిచింది. చివరి నుంచి మూడో స్థానంలో నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్ధులు నిలిచారు. నాగర్ కర్నూలు నుంచి 5363మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైతే 2444 మంది ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,78,527 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.కాగా ఈ రోజు విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్ 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు.  సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు అయిన https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. 
 
వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవచ్చు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కలిపి 9,80,978 మంది పరీక్షలు రాశారు.