
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర హోంమంత్రి, సీనియర్ బిజెపి నాయకులూ అమిత్ షా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కమలం పార్టీ కాపాడుతుందని, ఆయన భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్లోని కాగజ్నగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభలో ఆదివారం పాల్గొంటూ కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసిందని మండిపడ్డారు.
ఆ ఫేక్ వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సర్క్యూలేట్ చేశారని కేంద్రమంత్రి తప్పుబట్టారు. “కాంగ్రెస్ పార్టీ అబద్దాలను నమ్ముకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను మాట్లాడినట్లు ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ సర్క్యులేట్ చేసింది. ఆ వీడియోను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఫార్వార్డ్ చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నా అలానే తెలంగాణ దళిత, ఓబీసీ ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తేలేదు.” అని తేల్చి చెప్పారు.
70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్న అమిత్ షా, రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ ఇద్దరినీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించినా, తమ ఓటు బ్యాంకు పోతుందని ఇద్దరూ రాలేదని గుర్తు చేశారు. ఖర్గే, రాహుల్ ఓటు బ్యాంకు, ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటే అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు.
ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసిందని, తొలి రెండు విడతల్లో కమలం పార్టీ సెంచరీ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కొన్నాళ్లుగా బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతోందని చెబుతూఈసారి రాష్ట్రంలో పది ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఓ వైపు, సెలవుల కోసం బ్యాంకాక్ టూర్లు వేసే రాహుల్ బాబా మరో వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడకు వెళ్లినా ‘మోదీ, మోదీ’ నినాదాలే వినిపిస్తున్నాయని, కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు రావటం పక్కా అని అమిత్ షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్కు వేసే ఓటు నరేంద్రమోదీకి వేసేదే అని అన్నారు.
మరోవైపు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా అమిత్‌షా ప్రచారం నిర్వహించారు. అర్వింద్‌ను గెలిపిస్తే, బీడీ కార్మికులకు ఆసుపత్రి కట్టిస్తామని, చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లోనే పెడతామని తెలిపారు.
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు. రాహుల్, రేవంత్ పేరుతో ఆర్ఆర్ టాక్స్ వేసి, దిల్లీకి తరలిస్తున్నారని షా ఆరోపించారు. ఏబీసీ అంటే అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.
“ఇక్కడ పసుపు పంట చాలా ఎక్కువగా పండుతుంది. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ వెంటపడి మరీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సాధించారు. అర్వింద్ను రెండోసారి ఎంపీగా గెలిపిస్తే, పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లోనే పెడతాం. అలానే బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి కట్టిస్తాం.” అంటూ అమిత్ షా భరోసా ఇచ్చారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు