తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే మూడు, నాలుగు రోజులు వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడతాయని హెచ్చరించింది. ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. 

జనగామ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో సైతం ఈదురు గాలులతో వర్షం పడింది. ములుగు, నల్గొండ జిల్లా్ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 

అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 6న ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానంలో రేపు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

అలాగే పలు ప్రాంతాల్లో వేడి, తేమతో అసౌకర్యమైన వాతావరణం ఉందని చెప్పారు. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు  కురుస్తాయని తెలిపారు.