మోదీ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనం 

మోదీ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనం 
ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలోనే ఎన్నికైన ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించి, సరికొత్త రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కొనియాడారు. గత 12 సంవత్సరాలుగా బిజెపి  ప్రభుత్వం ” విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్” (ప్రజల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం) అనే మూడు మహోన్నత లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగిందని చెప్పారు.
 
ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల కాలం మిగిలి ఉందని, ఆ తర్వాత కూడా నరేంద్ర మోదీ మళ్లీ దేశ ప్రధానిగా రావడం ఖాయమని ఆయన పూర్తి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించినప్పటికీ, బ్రిటిష్ వారు వెళ్లిపోయినా వారు రూపొందించిన చట్టాలు, విద్యా విధానం, పరిపాలనా వ్యవస్థ అలాగే కొనసాగాయని విమర్శించారు. 
 
మోదీ కంటే ముందు పాలించిన యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల కాలంలో దేశం అనేక కుంభకోణాలను, తీవ్ర అవినీతిని చూసిందని, ప్రజలు ఆయా పరిస్థితులను ఇంకా మరచిపోలేదని పేర్కొన్నారు. కానీ ఈ పన్నెండు సంవత్సరాలలో మోదీ గారు చేసిన అత్యంత ముఖ్యమైన పని దేశాన్ని కాలనీయ (వలసవాద) భావజాలం నుండి బయటకు తీసుకురావడమేనని స్పష్టం చేశారు.
 
అందులో భాగంగానే ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ వంటి పాత చట్టాలను రద్దు చేసి భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) వంటి కొత్త చట్టాలను, కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారని, కమర్షియల్ కోర్టుల ఏర్పాటుతో పాటు న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, దీని పూర్తి క్రెడిట్ నరేంద్ర మోదీకే దక్కుతుందని తెలిపారు. ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ అద్భుత వృద్ధిని సాధించిందని రాంచందర్ రావు గారు పేర్కొన్నారు.
2014కు ముందు దేశ మౌలిక సదుపాయాలపై సుమారు రూ. 2 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, ప్రస్తుతం ఈ వ్యయం దాదాపు ఆరు రెట్లు పెరిగి రూ. 12.2 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపారు.  అదేవిధంగా విదేశీ మారక నిల్వలు కూడా భారీగా పెరిగి, ప్రస్తుతం దేశానికి సుమారు రూ. 67 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయని, ఇవి దేశ దిగుమతుల అవసరాలను అనేక నెలల పాటు భరించే స్థాయిలో ఉన్నాయని వివరించారు. 
ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా గత సంవత్సరాల్లో సుమారు 6 కోట్ల మందికి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత కల్పించారని, భారత్‌నెట్ ప్రాజెక్ట్ ద్వారా దేశవ్యాప్తంగా 2.14 లక్షల గ్రామపంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందించారని చెప్పారు.