తిరుపతిలో ఫోరెన్సిక్ యూనివర్సిటీ.. జగన్ వినతి 

తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ మేరకు గురువారం  కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో కేంద్ర హోంశాఖతో ముడిపడ్డ అనేకాంశాల గురించి చర్చించారు. 

ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఫోరెన్సిక్‌ సైన్స్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్‌ సైన్స్‌, క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్‌ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను తీర్చడం కోసం దక్షిణ భారత దేశంలోనూ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని జగన్ కోరారు. 

ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూ, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని అమిత్‌షాకు విన్నవించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి గుర్తుచేశారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరారు.