న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని న్యాయమూర్తులకు, న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వద్ద రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమి భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అలాగే, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టుతోపాటు ఆన్‌లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సంబంధించిన స్టాఫ్టువేర్ అప్లికేషన్స్‌ను కూడా ప్రారంభించారు. హైకోర్టు వార్షిక నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులనుద్దేశించి సిజెఐ ప్రసంగించారు.
దేశంలో 63 లక్షలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ తీర్పులు ఇచ్చే ముందు చట్టంలోని కీలక అంశాలతో పాటు సామాజిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పౌరహక్కులను కూడా కాపాడాలని చెబుతూ ట్రయల్, జిల్లా కోర్టు స్థాయిలోనే జాప్యం నివారించాలని సూచించారు.
న్యాయమూర్తులు సొంత సామర్థ్యంపై కూడా విశ్వాసం కలిగి ఉండాలని, నిత్య విద్యార్థులుగా ఉంటూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కన్నా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఉత్తమ పద్ధతులను పరస్పరం అనుసరించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలికంగా విచారణ పూర్తి కాని కేసుల విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, 35 ఏళ్ల పాటు గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఉదహరించారు.
మహరాష్ట్రలో పనిచేసిన సందర్భంలో వివిధ అంశాలపై తరచూ చర్చిస్తుండే వారమని, కొన్ని సినిమాలపై కూడా చర్చించి కీలక అంశాలను పరిగణలోకి తీసుకునేవారమని తెలిపారు. న్యాయవ్యవస్థ మెరుగపడాలంటే సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. రాబోయే తరాలకు రికార్డులు భద్రంగా అందించేందుకు డిజిటలైజేషన్, ఇ-ఫైలింగ్ విధానం పగడ్బందీగా నిర్వహించాలని, రానున్న ఐదేళ్లలో ఇ-ఫైలింగ్ విధానం మెరుగుపడాలని పేర్కొన్నారు.
దిగువ కోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కష్టతరంగా మారిందని చెబుతూ మహిళా న్యాయవాదులకు, మహిళా కక్షిదారులకు కనీసం వాష్ రూములు కూడా ఉండడం లేదని విచారం వ్యక్తం చేశారు. 2023లో అయినా జిల్లా, ట్రయల్ కోర్టుల్లో మహిళలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి జరగాలని ఆయన కోరారు. జ్యుడీషియల్ అకాడమి భవనంలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎపి జ్యుడీషియల్ అకాడమి బోర్డు ఆఫ్ గవర్నస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాద్, జస్టిస్ ఎస్‌ఎస్.సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, జ్యుడీషియల్ అకాడమి డైరెక్టర్ ఎం.హరిహరనాథశర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ వై.లక్ష్మణరావు, పాల్గన్నారు.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు